నాగబాబుకి ఈసారి ఆ ఉద్దేశ్యం లేదట.. నిజమేనా.?

జనసేన నుంచి 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటుడు నాగబాబు, పరాజయం పాలైన విషయం విదితమే. తమ్ముడి పార్టీలో చివరి క్షణంలో చేరి టిక్కెట్ దక్కించుకున్న నాగబాబు, తనకు తాను న్యాయం చేసుకోలేకపోయారు, పార్టీకి కూడా న్యాయం చేయలేకపోయారు. ముందే జనసేనతో ఆయన మమేకం అయి వుంటే, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వుంటే, నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం ఫలితం 2019 ఎన్నికల్లో ఇంకోలా వుండేదేమో. 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? నర్సాపురం నుంచి నాగబాబు తిరిగి పోటీ చేస్తారా.? అసలు నాగబాబు జనసేన పార్టీలో వున్నారా.? లేదా.? ఈసారి లోక్ సభ కాకుండా అసెంబ్లీ వైపుగా నాగబాబు ఆలోచన చేస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత.? ఈ ప్రశ్నల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇటీవలి కాలంలో నాగబాబు వేస్తున్న ట్వీట్లు, చేస్తున్న కామెంట్లు.. జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా దేవుడి విషయంలో నాగబాబు అపనమ్మకం, జనసేన పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎవరి నమ్మకాలు వారివి. అయినాగానీ, ఓ పార్టీ తరఫున పనిచేస్తున్నప్పుడు ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా వుండాలి. ఆ సంగతి పక్కన పెడితే, నాగబాబు వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదనే చర్చ జనసైనికుల్లో వుంది. దాన్ని నాగబాబు అధిగమించాలంటే, అభిమానులకి ఆయన మరింత చేరువవ్వాలి. నిజానికి, మెగా అభిమానులతో నేరుగా సంబంధాలు కలిగి వున్నది నాగబాబేనని ప్రజారాజ్యం పార్టీ సమయంలో నిరూపితమయ్యింది. కానీ, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. పవన్ అభిమానులతో నాగబాబుకి సఖ్యత తగ్గిపోయింది. దాంతో, నాగబాబు పట్ల జనసైనికుల్లో ఆ పాటి నెగెటివిటీ వుండడం సహజమే.