పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ ప్రభంజనం ఉంది. అతి తక్కువ టైంలోనే అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు పవన్. కేవలం సినిమాలతోనే కాక చేసే మంచి పనులతోను ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా పెరిగింది. అయితే సినిమాలతో పెద్దగా సాటిస్ఫై కాని పవన్ రాజకీయాలలోకి రావాలని ఎప్పటి నుండో కలలు అన్నారు. చిరంజీవితో కలిసి ప్రజారాజ్యంకు పని చేశారు. చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత పవన్ సొంతగా జనసేన అనే పార్టీని స్థాపించి పార్టీ నాయకుడిగా క్రియాశీల రాజకీయాలు చేస్తున్నారు.
రెండేళ్ళ ముందు రాజకీయాలతో బిజీగా ఉండడం వలన తాను సినిమాలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ మనసు మార్చుకొని వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, రమేష్ వర్మ ఇలా పలువురు దర్శకులతో పవన్ సినిమాలు చేయనున్నట్టు సమాచారం. అయితే ఓ సమయంలో పూర్తిగా సినిమాలు వదిలేస్తానని చెప్పి రాజకీయాల్లోకి దిగిన పవన్ అనూహ్యంగా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడంపై అందరు షాక్ అయ్యారు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఓ మీటింగ్‌లో నోరు విప్పారు.
పవన్ సినిమాలు చేయడం వెనుక చిరంజీవి ఉన్నారని నాదెండ్ల అన్నారు. అన్న సలహాతోనే పవన్ తిరిగి సినిమాలు చేస్తున్నారు. రాబోవు రోజులలో పవన్‌కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నాడు మనోహర్. మొత్తానికి పవన్ రీఎంట్రీ వెనుక చిరంజీవి హస్తం ఉందనే విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తుంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా పవన్ ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.