గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది, విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం ఒక మినీ యుద్దాన్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా తెరాస మరియు బీజేపీ మధ్యనే పోటీ జరుగుతుంది. నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి మీద మరొకరు మాటలతో దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఎంపీ అరవింద్ తెరాస ప్రభుత్వాన్ని చిక్కులో నెట్టే విధంగా ఒక కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాడు.
హైదరాబాద్ పరిధిలో గత కొద్దీ రోజుల నుండి ప్రధానమైన ప్రాంతాల్లో రాత్రిపూట కరెంట్ పోల్స్ కు ఎల్ఈడీ లైట్స్ దర్శనం ఇస్తున్నాయి. అయితే ఈ ఎల్ఈడీ లైట్స్ కాంట్రక్ట్ వెనుక పెద్ద కుంభకోణమే ఉందంటూ ఎంపీ అరవింద్ సంచలన విమర్శలు చేస్తున్నారు. స్తంభాలకు బిగించిన ఎల్ఈడీ లైట్స్ ఒక్కో మీటర్ వచ్చి 30 రూపాయల నుండి బయట మార్కెట్ లో దొరుకుతాయి. మంచి క్వాలిటీ లైట్స్ వేసిన మీటర్ 50 రూపాయలకు దొరుకుతుంది. ఒక్కో స్తంభానికి 20 నుండి 25 మీటర్లు అవసరం అవుతుంది, ఆ లెక్కన చూస్తే ప్రతి స్తంభానికి 1000 నుండి 1500 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ తెరాస సర్కార్ మాత్రం ఒక్కో స్తంభానికి 26 వేలు రూపాయల చొప్పున కాంట్రక్టు ఇచ్చింది.
వెయ్యి పదిహేను వందలు అయ్యే దానికి 26 వేలు ఇవ్వటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ కుట్రలో సీఎం కొడుకు కేటీఆర్, కవితల హస్తం ఉందని రాష్ట్రంలో ప్రధాన కాంట్రాక్టులు అన్ని వీళ్ళే ఖరారు చేస్తారని, గతంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు లు ఇలాంటి పనులు చేసేవాళ్ళు, ఇప్పుడు హరీష్ రావును పక్కకు పెట్టి వాళ్లిద్దరే చూసుకుంటున్నారు, దొంగ నోట్లు ముద్రించే వాడు కూడా రూపాయికి రూపాయి లాభం చూసుకుంటాడు, కానీ వీళ్ళు మాత్రం రూపాయి 26 రూపాయిలు లాభం చూసుకుంటున్నారు.
గ్రేటర్ లో 67 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామని చెపుతున్నారు, ఈ ఎల్ఈడీ లైట్స్ కాంట్రక్ట్ కూడా అందులో ఒక భాగమే, ఇది తెలంగాణలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఈ కుటుంబ పాలన ఉంటే ఇలాగే ఉంటుందని ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా స్వయంగా ఎల్ఈడీ లైట్స్ కలిగిన పోల్ దగ్గరకి వెళ్లిమరీ ఎంపీ అరవింద్ దానిని చూపిస్తూ విమర్శలు చేయటంతో ఆ వీడియో గ్రేటర్ ప్రజలను ఖచ్చితంగా ఆలోచింపచేసే విధంగా ఉంది.