రేటింగ్ : 2.5/5.0
రచన – దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
తారాగణం: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అమిత్ తివారీ, పోసాని, జయప్రకాష్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్,
ఛాయాగ్రహణం: ప్రదీష్ వర్మ
బ్యానర్: జిఎ 2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసూ వర్మ
విడుదల: అక్టోబర్ 15, 2021
ఆ మధ్య ‘హలో’, ‘మిస్టర్ మజ్నూ’ లాంటి రెండు రోమాంటిక్ కామెడీల తర్వాత మరో రోమాంటిక్ కామెడీ /డ్రామా తో వచ్చాడు అక్కినేని అఖిల్. నటించిన అయిదు సినిమాలతో యంగ్ స్టార్ గా నిలదొక్కుకునేందుకు విఫలయత్నం చేస్తూ వచ్చిన అఖిల్ కి, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ హిట్టవడం చాలా అవసరం. ప్రేమ సినిమాల సెగ్మెంట్ లో మడి గట్టుకున్న తెలుగు సినిమాలకి, ఇంకా హిట్టవడానికి విషయం ఏమీ మిగలని పరిస్థితుల్లో ఈ రిస్క్ తీసుకున్నాడు అఖిల్. ఓ ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, మళ్ళీ రోమాన్స్ తోనే అదృష్టాన్ని పరీక్షించుకుందా మనుకున్నట్టుంది. గీతా ఆర్ట్స్ వంటి అగ్ర బ్యానర్, అక్కినేని నాగార్జున వారసుడు, పూజా హెగ్డే లాంటి ట్రెండింగ్ స్టార్ కాంబినేషన్లు సమకూర్చుకుని హిట్టవ్వడానికి సన్నద్ధమయ్యాడు పండక్కి. మరి ఈ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడా లేదా ఓసారి చూద్దాం…
కథ
ఎన్నారై హర్ష (అక్కినేని అఖిల్) న్యూయార్క్ లో మంచి జాబ్ లో సెటిలై, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని, డాలర్లు వెనకేసుకుని, ఇక పెళ్ళి చేసుకోవడానికి అన్ని అర్హతలతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా హైదారాబాద్ వస్తాడు. అతను ఇక్కడ వుండే ఇరవై రోజుల్లో అమ్మాయిని చూసి, పెళ్ళి చేసేసి పంపాలన్న టైట్ షెడ్యూల్ వేసుకుని వుంటారు కుటుంబ పరివారం. రోజుకో అమ్మాయిని చూసేలా 20 మంది అమ్మాయిలతో పెళ్ళి చూపులేర్పాటు చేస్తారు. రకరకాల అమ్మాయిల్ని చూస్తూంటాడు. విభా (పూజా హెగ్డే) అనే అమ్మాయి జాతకం కలవలేదని రిజెక్ట్ చేస్తారు పరివారం. కానీ ఆ ఫోటోలో విభా హర్షకి నచ్చుతుంది. వాళ్ళింటికి వెళ్ళి చూద్దామనుకుంటే ఆమె తండ్రి సుబ్బు (మురళీ శర్మ) తో గొడవ వస్తుంది. విభా స్టాండప్ కమెడియన్ గా ప్రోగ్రాములు చేస్తూ, ఒక క్యారక్టర్ కి సుబ్బు అని తన తండ్రి పేరే పెట్టి పెళ్ళి- సంసారం జోకులతో నవ్విస్తూంటుంది. ఆమెని కలుసుకుంటాడు. కానీ తను అడిగే ప్రశ్నలకి ఆమె చెప్పే సమాధానాలు వింటే మతిపోయి, ఆమె ఏమిటో అర్ధం జేసుకోలేకపోతాడు. ఇతడికి పెళ్ళీ కాపురం ప్రేమ గురించి అవగాహన లేదని ఆమె తిరస్కరిస్తుంది. దీంతో డీలా పడ్డ హర్ష తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతాడు.
ఇప్పుడీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలెలా తొలిగాయి? హర్షకి అవగాహన లేకపోతే ఆమెకున్న మానసిక సమస్యేమిటి? అదెలా తొలగింది? ఆమె ప్రేమని ఇంకెలా పొందాడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
మొదటే చెప్పుకున్నట్టు, వచ్చిన తెలుగు ప్రేమ సినిమాలనే తిప్పితిప్పి అదే తీస్తే వచ్చే సమస్యే ఈ కథతోనూ వచ్చింది. కాకపోతే దీన్ని రెండు తెలుగు సినిమాల్ని కలిపి తీసినట్టున్నారు. ఈ దర్శకుడిదే ‘ఆరెంజ్’, ఇంకో దర్శకుడి ‘షాదీ ముబారక్’. ‘ఆరెంజ్’ లో రామ్ చరణ్ ది తనకేం కావాలో తెలియని కన్ఫ్యూజ్ పాత్ర అయినట్టు, ఇక్కడ అఖిల్ తోనూ కన్ఫ్యూజుడు పాత్రే. ఇక గత మార్చిలోనే వచ్చిన ‘షాదీ ముబారక్’ లో ఒక రోజు జరిగే వరస పెళ్ళి చూపుల ట్రాక్ వున్నట్టు, ఇక్కడ ఇరవై రోజులకి వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంది.
హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర వేసిన ప్రశ్నలతో అఖిల్ సమస్యలో పడ్డం కాన్ఫ్లిక్ట్ నేర్పరిస్తే, దాంతో అతను పొరాడి తనని ప్రూవ్ చేసుకునే కథ ప్రారంభించకుండా, ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీని సెకండాఫ్ పెద్దల జోక్యంతో రోమాంటిక్ డ్రామాగా మార్చెయ్యడంతో, కథకి ఒక అర్ధం పర్ధం లేకుండా, సీరియస్ క్లాసులు పీకీ, పీకించుకునే ఉపన్యాసంలా మారింది ముగింపు సహా.
అక్కినేని నాగార్జున ఈ సినిమా అయినా అఖిల్ ని సక్సెస్ బాటలో నడిపించాలన్న ఆతృతతో వున్నట్టు వార్తలొచ్చాయి. సినిమాలో కొన్ని మార్పు చేర్పులు చేయించినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇంత చేసినా ఫలితం మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఫ్రేమల్ని, పెళ్ళిల్ని నేటి ఆర్ధిక ప్రపంచం నిర్వచిస్తూంటే, ఇంకా ప్రేమ కథల్ని కాలం తీరిన టెంప్లెట్లు పెట్టుకుని తీస్తే చూసే కాలం పోయింది. థియేటర్ వెలుపల ఫ్రేమల్లో యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు వేరే వున్నాయి. వాటితో ఎంటర్ టైన్ చేయాలి. అంతేగానీ బయటి పరిస్థితికి థియేటర్లోపల చూపిస్తున్న పరిస్థితికీ ఏ సంబంధం లేకపోతే, పాత డ్రామాలే చూపిస్తే, చూసే ఓపిక వుండాలనుకోవడం అత్యాశే అవుతుంది.
నటనలు -సాంకేతికాలు
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కమ్ లవర్ బాయ్ గా అఖిల్ ఆద్యంతం ఫ్రెష్ గా కనిపిస్తాడు. సెకండాఫ్ లో గడ్డంతో కన్పిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా అయినందుకేమో. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ సంబంధాలు హోమ్లీగా నటించాడు. పూజా హెగ్డేతో రోమాంటిక్ సీన్లు ఫస్టాఫ్ లో నిలబెట్టాడు. సెకండాఫ్ కథ సీరియస్ కాబట్టి ఫస్టాఫ్ ఫన్ రోమాన్స్ వుండదు. రోమాన్సే వుండదు. ఆమె కంటబడకుండా సీక్రెట్ గా కథ నడిపిస్తూంటాడు. ఈ సీన్లన్నిట్లో నటనలో ఈజ్ వుంది. ఇంప్రూవయాడు. సాంగ్స్ లోనూ ఆకట్టుకుంటాడు. కథెలా వున్నా, పాత్రెలా వున్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఫస్టాఫ్ లో అఖిల్ ని కవ్విస్తూ ఎంటర్ టైన్ చేయడం కోసమే కాకుండా, అతడికి ఆమె విసిరే ప్రశ్నలతో, తర్వాత బయట పడే మానసిక సమస్యతో విషయమున్న పాత్రే పోషించింది. కానీ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాస్తా జానర్ మారిపోయి సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా కావడంతో, పూర్తిగా పాసివ్ – విషాద పాత్రగా మారిపోయి, యూత్ అప్పీల్ కి గండి కొట్టేసింది.
ఇక అటు వైపు, ఇటు వైపు కుటుంబ సభ్యుల పాత్రల్లో అఖిల్ కి జయప్రకాష్, ఆమని, అజయ్, ఇంకా చాలా మంది వుండగా, పూజాకి మురళీ శర్మ, ప్రగతి వుంటారు.
ఈ సినిమాకి హైలైట్ గోపీ సుందర్ సంగీతంలో పాటలు. ముఖ్యంగా ‘లెహరాయీ’ అనే హిందీ పదంతో పాట, ‘గుచ్చే గులాబీ’ అనే ఇంకో పాట చిత్రీకరణ సహా బావున్నాయి. రోమాంటిక్ కథకి ఆ వాతావరణపు ఆహ్లాదానిచ్చే ఛాయాగ్రహణాన్నిచ్చాడు ప్రదీష్ వర్మ. ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్. ఔట్ డోర్- ఇండోర్ లొకేషన్స్ రిచ్ గా వున్నాయి. ప్రొడక్షన్ విలువలు టాప్ క్లాస్.
చివరికేమిటి
తన పెళ్ళి కథ రాహుల్ రవీంద్రన్, చిన్మయి లకి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్తాడు అఖిల్. ఫస్టాఫ్ లో ముప్పావు గంట వరస పెళ్ళి చూపుల ట్రాక్ వుంటుంది. ఈ ట్రాక్ మధ్య లోంచే పూజా హెగ్డే తో ట్రాక్ మొదలై, ఇది వరస పెళ్ళి చూపుల ట్రాక్ తో కలగలిసిపోయిన మంచి ఎంటర్ టైనర్ ప్యాకేజీలా వుంటుంది క్రియేటివిటీ. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు పెడర్ధాలుగా, ద్వంద్వార్ధాలుగా తేలి, ఆ అమ్మాయిలతో కోర్టు కేసుకి దారితీయడం మాత్రం అసహజంగా వుంటుంది. కోర్టులో దీన్ని కామెడీ చేసి నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వరస పెళ్ళి చూపుల ట్రాకు అంతా కోర్టు కేసుగా ముగిసే మినీ కథగా తీర్చిదిద్దారు. ఇది కూడా బావుంది. పెళ్ళి చూపుల్లో అఖిల్ చేతగాని మాటలు, అప్పుడప్పుడు తను అడిగిన ప్రశ్నలకి పూజా చెప్పినవే కావడం అతడెంత ఇమ్మెచ్యూర్ క్యారెక్టరో కూడా ఎస్టాబ్లిష్ అవడానికి తోడ్పడ్డాయి.
ఇది కూడా బావుంది.
ఇక తర్వాత పూజా హెగ్డేతో ఫైనల్ సీనుగా, ఇంటర్వెల్లో ఆమె అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం కాన్ఫ్లిక్ట్ ని ఏర్పాటు చేస్తుంది. జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లూ ఏర్పాటు చేసుకుని పెళ్ళికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్పించు కోవడం కాదు, పెళ్ళి తర్వాత కలిసి జీవించడం ఎలా చెప్పు?- అన్న ఆమె ప్రశ్నకి ఇమ్మెచ్యూర్ సమాధానాలు చెప్పి దొరికిపోతాడు. దీంతో ముఖం చెల్లక న్యూయార్క్ తిరిగి వెళ్ళిపోతాడు.
ఇక్కడే సెకండాఫ్ కి గండి పడింది. హీరో హీరోయిన్లు విడిపోవడం రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణం కాదు. రోమాంటిక్ కామెడీల్లో వాళ్ళిద్దరూ పరస్పరం ప్రత్యర్ధులే కాబట్టి విడిపోకుండా, నువ్వెంతంటే నువ్వెంతని ఇగోల పోరాటం ప్రారంభిస్తారు. ఈ పోరాటం మాని ఏ వొకరు వెనక్కి తగ్గి విడిపోయినా, అది ఏడ్పించే రోమాంటిక్ డ్రామాకి దారి తీస్తుంది. ఇక్కడ జరిగిందిదే.
ఈ కాన్ఫ్లిక్ట్ దగ్గర అఖిల్ నిలబడక పోవడంతో, గోల్ తీసుకుని తన ఇగోతో ఆమెతో తేల్చుకునే మొండితనానికి పోక పోవడంతో, సెకండాఫ్ కథ తన చేతుల్లో లేక, పెద్దవాళ్ళ చేతుల్లో ఎలా పడితే అలా సాగే రోమాంటిక్ డ్రామాగా- సీరియస్ గా మారిపోయి, కష్టపడి నిలబెట్టిన ఫస్టాఫ్ నంతా నిష్ప్రయోజనం చేసేసింది.
―సికిందర్