ఉదయం కప్పు బ్లాక్ కాఫీ.. శరీరానికి ఎనలేని లాభాలు.. కానీ ఒక షరతు..!

ఉదయం ప్రశాంతంగా, ఉత్సాహంగా ప్రారంభం కావాలంటే చాలామందికి కాఫీ తాగుతారు. ఆ సువాసన, ఆ మొదటి కప్ రోజంతా ఉత్సాహాన్ని నింపేస్తుంది. అయితే సాధారణ పాలకాఫీ కన్నా బ్లాక్ కాఫీకి ఉన్న ప్రాధాన్యత తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన సర్వేలు, పరిశోధనలు చెబుతున్న వివరాలు ప్రకారం, ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయని చెబుతున్నారు.

బ్లాక్ కాఫీ లేదా అందులో కొద్దిగా గీ వేసుకొని తాగితే గుండె సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది సహజసిద్ధమైన ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో నిల్వ అయ్యే విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. మెదడు చురుకుదనం పెరిగి, పనిలో ఫోకస్ మరింత బలపడుతుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్లాక్ కాఫీ యాంటీ ఆక్సిడెంట్లకు నిలయంగా ఉండటం వల్ల వయస్సు పెరుగుదల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్, కాలేయ సంబంధ సమస్యలను దూరం పెట్టగలదు. వ్యాయామానికి ముందుగా బ్లాక్ కాఫీ తాగితే శరీరానికి కావలసిన ఎనర్జీ లభించి, వర్కౌట్ ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

అయితే జాగ్రత్తలు తప్పనిసరి. గ్యాస్, అల్సర్, అధిక ఆమ్లత్వం (Acidity) వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం మానుకోవడం మంచిది. అదేవిధంగా ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, టెన్షన్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజుకు ఒక కప్పు వరకు పరిమితం చేసుకుంటేనే బ్లాక్ కాఫీ అసలైన మిత్రమవుతుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే యువత, ఉద్యోగులు, ఫిట్‌నెస్ ప్రేమికులు బ్లాక్ కాఫీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఉదయాన్ని సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాలనుకుంటే.. ఒక కప్పు బ్లాక్ కాఫీ తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.