పవన్ వ్యాఖ్యలపై నాని అలా, మోహన్ బాబు ఇలా.!

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ నిన్న ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. సినీ పరిశ్రమలోనూ కలకలం రేపాయి. అయితే, సినీ పరిశ్రమ నుంచి కనీసం మెగా కుటుంబం అయినా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతిస్తుందా.? అన్న అనుమానాలు చాలామందిలో వున్నాయి. మెగా కుటుంబం సంగతి పక్కన పెడితే, సినీ నటుడు నాని స్పందించాడు. మరో సినీ నటుడు కార్తికేయ కూడా స్పందించాడు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా స్పందించారు. మోహన్ బాబు అయితే, ఒకింత వెటకారం టోన్‌లో ‘చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్’ అని పేర్కొంటూ, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలయిపోయాక మాట్లాడతానంటూ ట్వీటేశారు.

పవన్ ప్రస్తావించిన అన్ని అంశాలపైనా మోహన్ బాబు స్పష్టతనిస్తారట. ‘నాకంటే చిన్నవాడివి గనుక నువ్వు.. అని సంబోదించాను..’ అని మోహన్ బాబు పేర్కొనడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ‘మా’ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో పంచాయితీ ఎందుకనే భావనలో మోహన్ బాబు కాస్త మొహమాట పడినట్టున్నారు. పైగా, తన కుమారుడు విష్ణు ఎన్నికల్లో నిలబడిన దరిమిలా, విష్ణు ప్యానెల్‌కి ఓటెయ్యాలని కూడా మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇదిలా వుంటే, రాజకీయాల్ని పక్కన పెట్టి.. పవన్ కళ్యాణ్ వాదనను సమర్ధిస్తున్నానని హీరో నాని తన ట్వీటులో అభిప్రాయపడ్డాడు. పరిశ్రమ ఇబ్బందుల్లో వున్న విషయాన్ని గుర్తెరిగి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు నాని. కాగా, మరో యువ నటుడు కార్తికేయ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు. ఏ రాజకీయ పార్టీకీ తాను వ్యతిరేకమో, అనుకూలమో కాదని అన్నాడు.