రెబల్ స్టార్ కృష్ణంరాజు భోజన ప్రియుడు.. ఆయన అతిథి మర్యాదలు చేయడంలో రారాజు.! అందుకే, కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో బోల్డన్ని వంటకాలతో నిర్వహించారు. లక్ష మందికి వరకూ ఈ సంస్మరణ కార్యక్రమంలో కడుపు నిండా తిని వెళ్ళి వుంటారు.
టన్నుల లెక్కన మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్.. ఇలా రకరకాల నాన్ వెజ్ వంటకాలతోపాటుగా, వెజ్ వంటకాలూ వండి వడ్డించారు వచ్చినవారికోసం. ‘అందరూ భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్స్..’ అంటూ ప్రభాస్, వచ్చిన వారిని ఉద్దేశించి కోరాడు. అంతమంది జనాన్ని చూసి కృష్ణంరాజు కుటుంబం మురిసిపోయింది.
రాజకీయ ప్రముఖులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు, కృష్ణంరాజుకి ఘన నివాళులర్పించారు. ఇక్కడి వరకూ ఓ కథ, ఇక నుంచి వేరే కథ. ఇది రాజకీయ కథ.!
మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా కొందరు రాజకీయ కోణంలో విపరీత వ్యాఖ్యలు చేశారు. కృష్ణంరాజు, చిరంజీవి.. ఇద్దరూ మొగల్తూరుకు చెందినవారే. కానీ, కృష్ణంరాజు మాత్రమే మొగల్తూరు అభివృద్ధికి కృషి చేశారన్నది కొందరి ఆరోపణ. చిరంజీవి, అస్సలేమాత్రం మొగల్తూరుని పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
కృష్ణంరాజు గతంలో నర్సాపురం ఎంపీగా పని చేశారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవి రాజ్యసభకు పనిచేశారు, కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రిగా చిరంజీవి సేవలకు గతంలో ఇదే మొగల్తూరువాసులు హర్షం వ్యక్తం చేశారు. మరి, ఇప్పుడు విమర్శలు చేస్తున్నవారెవరు.?
జరిగింది సంస్మరణ కార్యక్రమం అయితే, ఇక్కడ రాజకీయాలెందుకు ప్రస్తావనకు వచ్చాయి.? చిరంజీవి తండ్రి చనిపోతే, ఇలాంటి సంస్మరణ కార్యక్రమం ఎందుకు చెయ్యలేదని డిమాండ్ చేయడంలో అర్థమేంటి.? చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌తోపాటు, ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో మొగల్తూరు వాసులు గర్వపడుతుంటారు కూడా.
పనిగట్టుకుని కొన్ని రాజకీయ శక్తులు, చిరంజీవి మీద దుష్ప్రచారానికి కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నాయనీ, ఇది అవాంఛనీయమని కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సైతం ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే, కృష్ణంరాజుకి చిరంజీవి సోదర సమానుడు.