పవన్ ఔట్, జగన్ ఇన్.. మోడీ వ్యూహమిదేనా.?

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఎవరితో జతకట్టనుంది.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ‘రాజకీయ అవసరాల్ని’ ప్రధాని నరేంద్ర మోడీ పసిగట్టారా.? మిత్రపక్షం జనసేన పార్టీ కంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే కలిసి వెళ్ళడం మేలని ప్రధాని మోడీ భావిస్తున్నారా.? ఇలా చాలా ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నాయి. ఓ పక్క, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీతో ఎలాగైనా తిరిగి ‘స్నేహం’ సంపాదించాలనే పట్టుదలతో వున్నారు. కానీ, ఆ దిశగా చంద్రబాబుకి బీజేపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రావడంలేదు. ప్రస్తుతానికైతే బీజేపీ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలతో సమదూరం పాటిస్తోంది.

మిత్రపక్షం జనసేనతో పైకి స్నేహం, తెరవెనుకాల అనుమానం.. అన్నట్టుంది పరిస్థితి. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఏ క్షణాన అయినా మారిపోవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేందుకు ఇంకా సమయం వుంది. కానీ, ఈలోగానే జమిలి హంగామా తెరపైకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా వుంటే, దేశంలో తమకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అప్రమత్తమవుతోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికార పీఠమెక్కిన బీజేపీకి, మూడోసారి అధికారం అంత తేలిక కాదు. మూడోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే, ఖచ్చితంగా అదనపు బలం అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీనే ఆ ఆప్షన్‌గా బీజేపీ ఎంచుకుంటోందట. ఇప్పటికే వైసీపీతో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దాన్ని కొందరు బీజేపీ నేతలు ఖండిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయనే అనుకోవాలి. మరి, వైఎస్ జగన్.. బీజేపీ విషయంలో ఏ ఆలోచనతో వున్నారో.?