Modi’s Govt : ప్యాకేజీ ఇచ్చితిరి.. హోదాపై చేతులెత్తేస్తిరి.!

Modi’s Govt : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేశారు కాబట్టి. ఏదీ ఆ ప్యాకేజీ.? అనడక్కండి.. అది దేవతావస్త్రం లాంటిది.. అది బీజేపీ నాయకులకు తప్ప, ఇంకెవరికీ కనిపించదు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేసరికి, ఆ ప్యాకేజీని కేంద్రం అమలు చేసేసింది.

ఆ ప్యాకేజీలోనే రాష్ట్రానికి రెవెన్యూ లోటు సహా పలు అంశాలున్నాయట. అదిరింది కదూ.. బీజేపీ స్కెచ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్రానికి వచ్చే నష్టమేంటి.? బీజేపీకి వచ్చే నష్టమేంటి.? అని ఆలోచిస్తే, అస్సలు నష్టమేమీ లేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఓ రాష్ట్రం. పైగా, కాస్త చెయ్యిందిస్తే.. దేశానికే ఊతమిచ్చేలా ఎదిగే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలుగుతుంది.

పొడవాటి సముద్ర తీరం.. బోల్డన్ని పంటలు పండే నేల.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన, రాష్ట్రం ఇప్పడిలా వుండటానికి కారణం విభజన. ఆ విభజన గాయానికి కారణం కాంగ్రెస్, బీజేపీలే

కాంగ్రెస్ పార్టీని అడిగి లాభం లేదు. బీజేపీ అధికారంలో వుంది కాబట్టి, ఆ పార్టీని నిలదీయాలి. కానీ, అలా నిలదీసేదెవరు.? పార్లమెంటు సాక్షిగా, ప్యాకేజీ ఇచ్చేశాం.. హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం ఇంకోసారి కుండబద్దలుగొట్టేసింది. కానీ, మన ఎంపీలు ఏం చేస్తున్నారు.? ఏదీ ప్యాకేజీ.. అని నిలదీయాలి కదా.? ఆ చిత్తశుద్ధి మన ఎంపీలకు వుంటే, ఇప్పుడిలా మాట్లాడుకోవాల్సిన అవసరమేముంది.?