ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఏ కొత్త ఆలోచన చేస్తారో చెప్పడం కష్టం. అలా చేసినవే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి. ఈ ఆలోచనలతో దేశం ఎంత ప్రగతి సాధించింది, ప్రజలు ఎంత ప్రయోజనం పొందారనేది పక్కనపెడితే ఈ ఆలోచనలు దేశాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒక కుదుపు కుదిపేశాయన్నది మాత్రం నిజం. ఇప్పుడు ఇంకో కొత్త ఆలోచనే మోదీ మెదడులో మెదులుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఆలోచనను పెద్దది అనడం కాదు మహా పెద్దది అనాలి. ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈసారి దేశానికి అధ్యక్షుడు అవ్వాలని భావిస్తున్నారట. అంటే ఇకపై రాష్ట్రపతి ఉండరు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా తరహాలో మన దేశానికి కూడ అధ్యక్షుడు ఉంటారన్న మాట. ఆయన కిందే ప్రధాని పోస్ట్.
ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఛాన్నాళ్ల క్రితం నాటిదే. పాత నాయకుల మనసుల్లో మెదిలిన కోరికే. పార్లమెంట్ వ్యవస్థ మూలంగా కేంద్ర పార్టీకి చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు చీటికీ మాటికీ అడ్డుతగలడం, కీలకమైన నిర్ణయాలని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవడం చేస్తున్నాయని, దాని కారణంగా దేశాభివృద్దికి తీసుకోవాలనుకున్న అనేక నిర్ణయాలు ఆగిపోయాయనేది ప్రధాన ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు. పార్లమెంటరీ వ్యవస్థ మూలంగా పెద్దగా బలంలేని దేవేగౌడ లాంటి నేతలు కూడ ప్రధాని అయ్యారు. అందుకే అధ్యక్ష వ్యవస్థ ఉంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నిర్ణయం అనే పద్దతి ఉంటుందనేది బీజేపీ వాదన. ఒకరకంగా ఇది మంచిదే అయినా భిన్నత్వం కలిగిన మన దేశంలో కొన్ని నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది. అదే ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం.
అధ్యక్ష పాలన అమలులోకి వస్తే కేవలం జాతీయ పార్టీలే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలవు. ప్రాంతీయ పార్టీలకు పార్లమెంటులో ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. అవి కేవలం రాష్ట్ర శాసన సభలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఫలితంగా కేంద్రం ఏం చెబితే అదే చేయాల్సి ఉంటుంది. ఏ దశలోనూ ప్రాంతీయ పార్టీల అవసరం అధ్యక్షుడికి ఉండదు. ఇది ప్రాంతీయ పార్టీలకు పెద్ద దెబ్బే. ఉదాహరణకి మన రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్ జగన్ యొక్క వైసీపీనే తీసుకోండి. వైసీపీకి 22 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 6 గురు సభ్యులున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇది మంచి సంఖ్యా బలమే. కేంద్రం ఎలాంటి బిల్ పాస్ చేయాలనుకున్నా వైసీపీ తరహాలో సభ్యుల బలమున్న ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్దతి కేంద్ర ప్రభుత్వ దూకుడుకు స్పీడ్ బ్రేకర్ లాంటిది. కేంద్రం నిర్ణయాలు నష్టం కలిగించేవిగా ఉంటే ప్రాంతీయ పార్టీలు దాన్ని నిలువరించవచ్చు. కానీ అధ్యక్ష పాలన వస్తే ప్రాంతీయ పార్టీలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి. అప్పుడు వైఎస్ జగన్ లాంటి నాయకులు రాష్ట్రంలో ఎంత బలం సంపాదించినా వృథాయే.