నరేంద్ర మోడీ కాకపోతే ఎవరు.? అన్న ప్రశ్నకు భారతీయ జనతా పార్టీలో సరైన సమాధానమే లేదు. బీజేపీ అంటేనే మోడీ.. మోడీ అంటేనే బీజేపీ. ఔను, అమిత్ షా అయినా, ఇంకొకరైనా.. నరేంద్ర మోడీ స్థాయి ‘మేనియా’ కలిగి లేరన్నది నిర్వివాదాంశం. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ సంచలన విజయాన్ని అందుకున్నారు.. పార్లమెంటులో అడుగు పెడుతూనే ప్రధాని అయ్యారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ మోడీ సత్తా చాటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏడేళ్ళ మోడీ పాలనలో దేశం ఏం బాగుపడింది.? అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పెట్రో ధరలు సెంచరీ కొట్టేశాయి.. పన్నుల మోత మోగిపోతోంది. అదే సమయంలో అప్పులూ పెరిగిపోతున్నాయి.
కరోనా దెబ్బకి దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోయింది. మరోపక్క, రాష్ట్రాల అధికారుల్ని కేంద్రం లాక్కునేలా నరేంద్ర మోడీ చాలా కుయుక్తులు పన్నారన్న విమర్శలున్నాయి. కరోనాకి ముందు.. కరోనా తర్వాత.. అన్నట్టుగా మోడీ మేనియా గురించి వేర్వేరుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ, కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ సమయంలోనూ దేశ ప్రజానీకం మోడీ చెప్పిన మాటల్ని విన్నారు. రెండో వేవ్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది.
మోడీ మేనియా మసకబారిపోయింది. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకపోయినా వ్యాక్సిన్ ఉత్సవ్ ప్రారంభించడం సహా అనేక తొందరపాటు చర్యలతో మోడీ తన ఇమేజ్ తానే దెబ్బతీసుకున్నారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, మోడీ ఇమేజ్ తగ్గుతోంది సరే.. మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు.? అదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గట్టిగా నిలబడగలిగితే.. మోడీకి రాజకీయంగా మూడినట్టే. కానీ, రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు.