Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నాగర్ కర్నూల్ సభలో ముఖ్యమంత్రి పదవి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాలమూరు బిడ్డనైన తాను మరో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలా మరో పదేళ్లపాటు తానే సీఎం అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… “రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు” అంటూ ఈయన చేసిన పోస్ట్ తెలంగాణ రాజకీయాలలో చర్చలకు కారణమైంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దల చర్చల అనంతరం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అయితే ఈయన మాత్రం నేనే ముఖ్య మంత్రిగా కొనసాగుతాను అంటూ తనకు తానే ప్రకటన చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తూ చర్చలకు కారణమైంది.
