ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని చంద్రబాబు రాక్షసుడిలా పట్టి పీడిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన ఆకృత్యాలన్నీ ఏపీ ప్రజలకు తెలుసని.. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్లలా టీడీపీ నేతలు నటిస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 40 ఆలయాలను కూల్చేసి… అమరేశ్వరుడి భూములను మింగేసి.. ఆలయాల్లో తాంత్రిక పూజలు చేయించారు. అవన్నీ ఏపీ ప్రజలకు తెలియదా? అటువంటి చంద్రబాబును క్షమించాలా? శిక్షించాలా? టీడీపీ శ్రేణులే సమాధానం ఇవ్వాలంటూ మంత్రి డిమాండ్ చేశారు.
టీడీపీ సోషల్ మీడియా విభాగం వార్తలన్నీ అబద్ధం
సోషల్ మీడియాను టీడీపీ ఆక్రమించేసుకొని వింగ్ ఏర్పాటు చేసుకొని కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రమే ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో దేవాలయాల గురించి టీడీపీ ప్రచారం చేస్తున్న వార్తలను స్వామీజీలు, మత పెద్దలు నమ్మొద్దు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2017లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలస్వామి ఆలయంలో రథం దగ్ధమయింది. మరి.. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ప్రస్తుతం తన ప్రతిపక్షనాయకుడి హోదాకు చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
దేవాలయాలపై చంద్రబాబు అండ్ కో కావాలని రచ్చ చేస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయి. కావాలని దేవాలయాల మీద మచ్చ తేవాలని చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనక్కి వెళ్లదు.. అంటూ మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు.