జగన్ సర్కార్ తీసుకొచ్చిన కాపు నేస్తం పథకంపై జనసేన అధినతే పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. దొంగలెక్కలు చెప్పి కాపుల్ని మోసం చేస్తోన్న ప్రభుత్వంగా వైకాపాను ఎండగట్టారు. కాపు కార్పోరేషన్ కు ఇప్పటివరకూ ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎంత ఖర్చు చేసారో శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి కురసాల కన్నబాబు నిప్పులు చెరిగారు. కాపు నేస్తంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నేస్తం కింద మహిళలకు 4,769 కోట్లు ఆర్ధిక సహాయం అందించామన్నారు.
అన్నివేల కోట్లు అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇలా మంచి పనులు చేస్తోన్న ప్రభుత్వాన్ని చూసి పవన్ ఓర్వలేకత ఉక్రోషంతో ఉన్నారని మండిపడ్డారు. పవన్ కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలకు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. కాపుల కోసం గతంలో ముద్రగడ పద్మనాభ ఉద్యమం చేస్తే దాన్ని చంద్రబాబు ప్రభుత్వం అణదొక్కినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎంతో మంది కాపులపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిచారన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాగున్నారో చెప్పాలని కురసాల డిమాండ్ చేసారు. ఇకనైనా పవన్ తీరును మార్చుకోవాలని, వాస్తవాలు గ్రహించాలన్నారు.
మరి మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో? చూడాలి. పవన్ ఇప్పటికే జగన్ ఏడాది పాలనపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం, ప్రభుత్వ స్థలాల అమ్మకంపై సహా జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేసారు. కానీ వీటిపై అధికార పక్షం నేతలు పవన్ ని పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాపు నేస్తంపై పవన్ ఇంకాస్త చొరవ తీసుకోవడంతో అధికార పక్షం నేతలు సీన్ లోకి ఎంటరై ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.