Kodali Nani : ఎన్టీయార్ అభిమానుల తరఫున పాదాభివందనమా.? అదెలా.!

Kodali Nani : కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లా నుంచి వేరు పడుతున్న ఓ భాగానికి ‘ఎన్టీయార్ జిల్లా’గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేసిన విషయం విదితమే. ‘వైఎస్సార్ జిల్లా..’ అని పేరు పెట్టినప్పటికీ, ‘కడప జిల్లా’గానే అంతా మాట్లాడుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయంలోనూ అంతే.!

సరే, ఈ పేర్లు పెట్టడం వల్ల ఉపయోగమేంటి.? అన్నది వేరే చర్చ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెడితే తప్ప, పొట్టి శ్రీరాములు అనే మహనీయుడ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలచుకోకుండా వుంటారా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇదే వాదన వర్తిస్తుంది. రేప్పొద్దున్న ఎన్టీయార్ విషయంలో అయినా అంతే.

చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగాన్ని విడదీసి, దానికి శ్రీ బాలాజీ జిల్లాగా పేరు పెట్టారు. నిజానికి, తిరుపతి జిల్లాగా పేరు పెట్టి వుంటే, దానికి మరింత గౌరవం లభించేది. ఏమో, ముందు ముందు ఈ పేర్ల మార్పు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందేమో.!

అల్లూరి జిల్లా అయినా, ఇంకో జిల్లా అయినా.. పేర్లు మార్చడం అనేది రాజకీయ కోణంలో జరిగేవేనన్న వాదన లేకపోలేదు. వాటి ద్వారా కలిగే రాజకీయ లబ్ది ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక, ఎన్టీయార్ జిల్లా ప్రకటించారు గనక, ఎన్టీయార్ అభిమానుల తరఫున ముఖ్యమంత్రికి పాదాభివందనం.. అంటున్నారు మంత్రి కొడాలి నాని.

పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అపారమైన భక్తి భావన వుంటే, ‘పాదాభివందనం’ అని మంత్రి కొడాలి నాని అనొచ్చుగాక. అలాగని, ఎన్టీయార్ అభిమానులందరి తరఫున పాదాభివందనం అంటే ఎలా.? అసలు కొడాలి అలా అన్నారా.? లేదంటే, వైసీపీ అభిమానులు అలా ప్రచారం చేస్తున్నారా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.