మంత్రి కొడాలి నాని చాలా అగ్రెసివ్.. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే, రాను రాను కొడాలి నాని మాటలు మరీ దారుణంగా అదుపు తప్పేస్తున్నాయి. ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ..’ అనే స్థాయిలో కొడాలి నాని, రాజకీయ ప్రత్యర్థులకు సమాధానమిస్తోంటే, అధికార వైసీపీ శ్రేణులు పండగ చేసుకోవడంలో వింతేమీ వుండదు. కానీ, ఇక్కడ కొడాలి నాని వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిపోతోంది. ఆయన సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే. అంతేనా, ఆయన ఓ మంత్రి కూడా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నోరు జారితే అదో లెక్క. ఆయన ప్రతిపక్షంలో వున్నారు. అలాగని, ఆయన్నీ సమర్థించలేం.
రాజకీయాల్లో ఎవరైనాసరే సంయమనం పాటించాల్సిందే. లేకపోతే, ప్రజల్లో చులకనైపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, వైసీపీ ముఖ్య నేతల మీదా నారా లోకేష్ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. కానీ, దానికి సమాధానమివ్వడానికి మంత్రి కొడాలి నాని అవసరమా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కోడాలి నాని కంటే గట్టిగా తిట్టగల నాయకులు వైసీపీలో చాలామందే వున్నారు. కానీ, ఓ మంత్రి ఎందుకు ఇలా అత్యుత్సాహం చూపుతున్నారు..? అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. ‘నన్ను బూతుల మంత్రి అంటారు గానీ..’ అని నాని ప్రస్తావించడమూ ఆయనకు చాలా చెడ్డ పేరు తెస్తోంది.
అధినేతను వెనకేసుకురావడంలో కొడాలి నాని బాధ్యతను తప్పు పట్టలేం. కానీ, అందుకూ ఓ పద్ధతి వుంటుంది. ప్రతిపక్షం రెచ్చగొడుతున్నప్పుడు.. అధికార పక్షం సంయమనం పాటించాలి. మంత్రులు ఈ విషయంలో ఇంకా బాధ్యతగా వుండాలి. లేదంటే, ఈ తిట్ల ప్రభావం వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తమ్మీదా పడుతుంది. ముఖ్యమంత్రి స్వయానా విపక్షాలపై తిట్ల వర్షం తమ పార్టీ నేతలతో, మంత్రులతో కురిపిస్తున్నారనే విమర్శ వచ్చే అవకాశముంది.