Minister Amarnath : మంత్రి గుడివాడ అమర్నాథ్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది. మరో మాజీ మంత్రి పేర్ని నానిని కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటే బెటరేమో.! పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే అధినేత మెప్పు పొందవచ్చుననుకుంటే ముందు ముందు ఆయన ‘మాజీ’ అవుతారు తప్ప, రాజకీయంగా ఆయనకు ప్రయోజనం వుండదు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇది ఎవరూ కాదనలేని విషయం. మొదటి భార్య ఎవరు.? రెండో భార్య ఎవరు.? మూడో భార్య ఎవరు.? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కోలేక, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న విమర్శ వైసీపీ మీద జనం నుంచి వచ్చే స్థాయికి వైసీపీ దిగజారిపోకూడదు.
మంత్రి పదవి చేపట్టాక, తన శాఖకు సంబంధించి ఏం చేయగలనన్నదానిపై ‘గ్రౌండ్ వర్క్’ మొదలు పెడితే, గుడివాడ అమర్నాథ్ తన రాజకీయ భవిష్యత్తుకి మేలు చేసుకోగలుగుతారు.. తద్వారా వైసీపీకి మంచి చేయగలుగుతారు. రాష్ట్రానికీ దానివల్ల ఉపయోగముంటుంది.
సరే, రాజకీయాలన్నాక విమర్శలు మామూలే కావొచ్చు. మరీ ఇంత దారుణంగానా.? ఈ విమర్శలు అధినేత వైఎస్ జగన్ చేయిస్తున్నారనే స్థాయికి వైసీపీ నేతలే, వైసీపీ ఇమేజ్‌ని నాశనం చేస్తుండడం గమనార్హం.
పేర్ని నాని, కొడాలి నాని సోయ లేకుండా ఇలా అడ్డగోలు ఆరోపణలు చేయడం వల్లే మంత్రి పదవుల్లో కొనసాగలేకపోయారు. పెద్దిరెడ్డి, ఆదిమూలపు.. ఇలాంటోళ్ళు ఎందుకు కొనసాగించబడ్డారంటే.. ఈ స్థాయిలో వాళ్ళు దిగజారిపోలేదు గనుక.!