మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రం.. ఏపీలో పాఠశాలలకు భారీ సెలవులు.. ఎన్నిరోజులంటే..?

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. గాలులు, వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉండటంతో విద్యాశాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో రెండు రోజుల బ్రేక్ ఉంటే, మరికొన్ని జిల్లాల్లో ఐదు రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, కాకినాడ జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అక్టోబర్ 27 నుంచి 31 వరకు మొత్తం ఐదు రోజుల సెలవులు ప్రకటించారు. వరుస వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో మూడు రోజులపాటు (27, 28, 29) సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, కడప, అన్నమయ్య జిల్లాల్లో రెండు రోజులపాటు (27, 28) పాఠశాలలు మూసివేయనున్నారు. పల్నాడు జిల్లాలో పరిస్థితి తేలికగా ఉండటంతో ఒకరోజు మాత్రమే సెలవు ప్రకటించారు.

అయితే ఇది తుఫాన్ తీవ్రతపై ఆధారపడి మారే అవకాశం ఉందని విద్యాశాఖ తెలిపింది. వర్షపాతం స్థాయి, ఈదురుగాలుల ప్రభావం పెరిగితే సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు. తుఫాన్ మార్గం, తీరం దాటే ప్రాంతాలు, గాలుల వేగం వంటి అంశాలను పర్యవేక్షిస్తూ, జిల్లాల వారీగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక అధికారుల ప్రకటనలను గమనించాలని, అవసరమైతే ఆన్‌లైన్ బోధన ద్వారా క్లాసులను కొనసాగించే అవకాశముందని విద్యాశాఖ సూచించింది. పాఠశాల భవనాలు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటే, అవి తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా ఉపయోగించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 100కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, విద్యార్థులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు తిరిగి ప్రారంభించే తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. విద్యార్థులు భద్రంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు.