అందాల భామలు ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలు ఎక్కుతుండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. పెళ్లైతే వీరు సినిమాలకు దూరమవుతారేమోనని కొంత ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే సమంత, కాజల్, నిహారిక వంటి అందాల ముద్దు గుమ్మలు పెళ్లి పీటలెక్కగా ఇప్పుడు పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా నచ్చిన వాడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మెహ్రీన్ చేసుకోబోయే వ్యక్తి గొప్పింటి కుర్రాడు కాగా, అతనిని పరిణయమాడేందుకు ఈ అమ్మడు చాలా ఉత్సుకతతో ఉంది.
మెహ్రీన్ .. కొన్నాళ్లుగా . హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో ప్రేమలో మునిగి తేలుతుంది. వీరిద్దరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక మార్చి 13న రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరగనుంది. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని నిశ్చితార్ధం తర్వాత ప్రకటించనున్నారు. మెహ్రీన్ ఇప్పటికే తనకు కాబోయే వాడి ఫొటోను బయటకు వదలగా, ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు అనే కామెంట్స్ పెడుతు్న్నారు.
అయితే భవ్య బిష్నోయి గత లోక్‌సభ ఎన్నికల్లో హిసార్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. బిష్నోయి ఫ్యామిలీపై బ్లాక్ మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి. రూ.30 కోట్ల మేర ఆదాయ పన్నును బిష్నోయి ఫ్యామిలీ ఎగ్గొట్టినట్టు అప్పట్లో ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక మెహ్రీన్ విషయానికి వస్తే ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఎఫ్ 3 అనే చిత్రంలో నటిస్తుంది. ఆగస్ట్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రమే మెహ్రీన్‌కు చివరి చిత్రం కానుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.