మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి కొత్త సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమా సెట్స్ మీద ఉండగానే మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో మోహన్ రాజా చేయబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ మీద మాత్రమే క్లారిటీ వచ్చింది. మిగతా సినిమాల మీద ఎలాంటి అప్డేట్ లేదు. ముఖ్యంగా మెహర్ రమేష్ సినిమా మీద. మెహర్ రమేష్ లాక్ డౌన్ ముందే చిరుతో టచ్లో ఉంటున్నారు. మొదటగా వీరి సినిమా వార్తలే బయటికొచ్చాయి. కొరటాల శివ సినిమా పూర్తవగానే చిరు మెహర్ రమేష్ సినిమానే చేస్తారని అంతా అనుకున్నారు.
నిజానికి మెహర్ రమేష్ కూడ అదే అనుకున్నారు. కానీ ఇప్పుడేమో ఆలస్యమవుతోంది. ఈపాటికే వీరి సినిమా అప్డేట్ బయటకు రావాలి. మరోవైపు మోహన్ రాజా తర్వాత బాబీ సినిమా అనే టాక్ నడుస్తోంది. అంటే ముందెప్పుడో అప్డేట్ వచ్చిన మెహర్ రమేష్ సినిమా ఆఖరకు వెళ్లిపోయినట్టే అనుకోవాలి. ఇంకొందరేమో అసలు సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం కూడ వ్యక్తం చేస్తున్నారు. కానీ మెహర్ రమేష్ మాత్రం చిరు ఎప్పటికైనా అవకాశాం ఇస్తారని గత రెండేళ్లుగా ఆయన కాంపౌండ్లోనే మగ్గిపోతున్నాడు.