మెగాస్టార్ చిరంజీవిని గురువారం ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. వీర్రాజు కలిసింది కేవలం మెగా ఆశీస్సుల కోసమే అయినా చిరు ఒకప్పటి నాయకుడు కాబట్టి సహజంగానే ఇలాంటి కథనాలు వెలువడుతుంటాయి. ఇప్పుడు అదే జరిగుతోంది. కానీ పొలిటికల్ కారిడార్ లో చర్చలు మరోలా ఉంటాయి కదా! ఆవలిస్తే కడుపులో ప్రేగులు లెక్కపెట్టడం..కోడు గుడ్డు మీద ఈకలు పీకే కథనాలకు కొదవేమి ఉండదు. ఈ నేపథ్యంలోనే చిరు పై అప్పుడే బోలెడన్ని పొలిటికల్ వార్తలు ముసురుకున్నాయి. 2024 బీజేపీ-జనసనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చిరంజీవి అన్నారో? లేదో? స్పష్టంగా తెలియదు గానీ! ఆయన నిజంగా అన్నట్లే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత, ఏపీ అధ్యక్షుడు నేరుగా చిరంజీవిని కలవడంతో ఈ మాజీ నేతని కూడా మళ్లీ పాలిటిక్స్ లోకి లాగుతున్నారని ప్రచారం ఠారెత్తిపోతుంది. ఇదంతా మెదీ-షా వ్యూహం అంటూ కథనాలు వడ్డి వార్చుతున్నారు కొందరు. కానీ చిరంజీవి ఏ పార్టీ కొమ్ము కాయరు! అన్నది ఆయన సన్నిహిత వర్గాలు బలంగా చెబుతున్న మాట. అవును ఓసారి పార్టీ పెట్టి దెబ్బతిన్న అనుభవం ఆయనకుంది. ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్తే ఎలా ఉంటుందన్నది తెలుసు. ఆ అనుభవం మెగాస్టార్ కి బాగా తెలుసు. అందుకే ప్రజారాజ్యం పార్టీనీ కాంగ్రెస్ లో కలిపేసి నెమ్మదిగా చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కొన్నాళ్లు కొనసాగినా ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. నేతలతో, నాయకులతో తనకేమైనా పనులుంటే చూసుకుంటున్నారు తప్ప! ప్రజా సమస్యలపై మాత్రం ఆయన పోరాటం ఏ దశలోనూ చేయలేదు.
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలగడంతో వెనుకుండి వైకాపాకి మద్దతిస్తున్నారనే ప్రచారం ఇప్పటికే సాగింది. కానీ అందుకు ఎంత మాత్రం ఆస్కారం లేదని ఆ కాంపౌండ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలతో అవసరం మేర మాత్రమే కలవడం…మాట్లాడటం…సమావేశం అవ్వడం వంటివి జరుగుతున్నాయి తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవంటున్నారు. మెగాస్టార్ జగన్ మద్దతుదారుడు కాదని…అలాగని బీజేపీ మద్దతుదారుడు అంతకన్నా కాదని ప్రేక్షకాభిమానులు గమనించాల్సిన విషయమని చెప్పకనే చెప్పారు. అలాగే తమ్ముడు పార్టీ జనసేన లో మెగాస్టార్ చేరతారని అస్సలు ఊహకు కూడా రానివ్వొద్దన్నది మరో అభ్యర్ధన కూడా వినిపిస్తోంది. చిరు ఏ పార్టీకి మద్దతివ్వకుండా న్యూట్రల్ గానే ఉంటారని అంటున్నారు. ఎందుకలా? అంటే అంతా ఎక్స్ పీరియన్స్ అనే చెబుతున్నారు.