టాలీవుడ్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ ప్రభావంతో చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. వాటిలో మీడియం రేంజ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఒకవైపు ఓటీటీలు దొరికిన సినిమాను దొరికినట్టు కొనేస్తున్నాయి. సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ చేసుకోలేకపోతున్న నిర్మాతలకు ఆఫర్లు పంపుతున్నాయి. కొన్ని సినిమాలకు పెద్ద మొత్తంలోనే ఇస్తామని అంటున్నాయట. దీంతో అమ్మేసి వడ్డీల భారం నుండి భయటపడదామని మీడియం రేంజ్ నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఇక్కడే డిస్ట్రిబ్యూటర్లు అడ్డుతగులుతున్నారు. ఓటీటీలకు అమ్ముకుని మీరు సొమ్ము చేసుకుంటే ఇన్నాళ్లు సినిమాలు కొని ఇప్పుడు కష్టాల్లో ఉన్న మా పరిస్థితి ఏంటి అంటున్నారు.
వారి బాధలోనూ అర్థం ఉంది కాబట్టి ఒక మూడు నెలలు సినిమాలను ఓటీటీలకు అమ్మవద్దనే తీర్మానం జరిగింది ఇండస్ట్రీలో. అయితే ఇది తప్పక పాటించాల్సిన నియమం కాదు. ఇష్టం ఉన్న నిర్మాతలు ఓటీటీలకు అమ్ముకోవచ్చు. కానీ జంకుతున్నారు. కారణం భయం. బడా నిర్మాతలను కాదని ఓటీటీలకి సినిమాలను అమ్మేస్తే మళ్లీ సినిమా తీయగలమా అనే ఆందోళన. హీరోలు సైతం పెద్దవాళ్ళని గిల్లుకుని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, ఆలస్యమైనా సరే సినిమాల్ని థియేటర్లకే ఇచ్చేద్దాం, మీరు గనుక ఇప్పుడు ఓటీటీలకి అమ్మేస్తే తర్వాత మాకు సినిమాలు ఉండవు అంటూ తమ నిర్మాతలను రిక్వెస్ట్ చేసుకుంటున్నారట. మరోవైపు సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాత మాత్రం తమ సినిమా నారప్పను ఓటీటీల రిలీజ్ చేసేశారు కూడ. ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తులను ఎవ్వరూ టచ్ చేయలేరు కాబట్టి.