Russia Ukrain War : సైనిక చర్య అన్నారు.. అది కాస్తా యుద్ధంగా మారిపోతోంది. ఉక్రెయిన్‌కి నాటో దేశాల నుంచి ఆయుధ సహకారం అందబోతోంది. దాంతో, రష్యా మరింతగా ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతోంది.. దాడుల తీవ్రతను పెంచింది. ఫలితంగా అపార నష్టం సంభవిస్తోంది.
‘మేం సాధారణ పౌరుల మీద దాడులకు దిగడంలేదు..’ అని రష్యా చెబుతున్నా, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అసలు ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందన్న విషయమై ప్రపంచంలో ఏ దేశానికీ సరైన స్పస్టత లేకుండా పోయింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడేమో, తాను ఉక్రెయిన్ వదిలి పారిపోలేదనీ, రాజధాని కీవ్‌లోనే వున్నానంటూ సెల్ఫీ వీడియోలు పెడుతున్నాడు. సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నాడు. ఇంకోపక్క, రష్యా అధినేత అయితే ఉక్రెయిన్ చర్చలకు వస్తే, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి తాము సిద్ధమని చెబుతూనే, ఉక్రెయిన్ ముందుగా ఆయుధాలు వదిలేయాలని చెబుతున్నాడు.
ఇది ఇక్కడితో తెగే విషయం కాదు. వందల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా ఆ లెక్క వేలల్లో వుంటుందనే అభిప్రాయం యుద్ధ రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. రోజు గడిస్తే పరిస్థితిలో తేడా వచ్చేసింది. సాధారణ ప్రజలు నివసించే భవనాలపైనా దాడులు జరుగుతున్నాయి.
మిస్సైళ్ళు దూసుకొస్తున్నాయి.. రాకెట్లు పేలుతున్నాయి.. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో జనం చచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నాటో సైనిక సహకారం ఉక్రెయిన్‌కి అందితే.. నో డౌట్, అది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. అప్పుడు వేలల్లో కాదు, లక్షల్లో కోట్లలో జనం చనిపోతారు.. కాదు కాదు, ఈ భూమ్మీద మానవాళి అంతమైపోతుంది.