లాక్ డౌన్ మూలంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. వాటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా కూడ ఒకటి. ఇందులో గోపిచంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. దీంతో మారుతి టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే కొత్త సినిమా మొదలుపెట్టారు. లాక్ డౌన్ టైంలో ఈ సినిమా కథను రాశారట మారుతి. ఇందులో హీరోగా సంతోష్ శోభన్ చేస్తున్నాడు.సంతోష్ శోభన్ ఇటీవలే ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ లభించడంతో సంతోష్ శోభన్ కి ఆఫర్లు పెరిగాయి.
అలా వచ్చిన ఆఫరే మారుతి సినిమా. ఇందులో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను కేవలం 30 రోజుల్లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మారుతి. ఎందుకంటే ఆయన తర్వాత ‘పక్కా కమర్షియల్’ చేయాల్సి ఉంది. ప్రజెంట్ గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘సీటిమార్’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. అది కంప్లిట్ కాగానే ‘పక్కా కమర్షియల్’ సినిమాను రీస్టార్ట్ చేస్తాడు. ఆలోపే సంతోష్ శోభన్ సినిమాను పూర్తిచేయాలనేది మారుతి ప్లాన్. నిజానికి సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయడంలో మారుతి దిట్ట. కాబట్టి ఈ కొత్త సినిమాను ఆయన అనుకున్న సమయానికే పూర్తిచేస్తారనడంలో సందేహం లేదు.