మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే వివాదాలూ షురూ అయ్యాయి. తాజాగా మంచు విష్ణు, తన ప్యానెల్ సభ్యుల్ని వెంటేసుకుని మీడియా ముందుకొచ్చాడు. ‘మా’ అభివృద్ధి కోసం తమ ప్యానల్ అనేక ఆలోచనలు చేసిందంటూ ఆ ఆలోచనల్ని మీడియాతో పంచుకున్నాడు కూడా. ‘మా’ అనేది రాజకీయాలకు అతీతం. ‘మా’ ఎన్నికలు కూడా అంతే. ఈ విషయాన్నే విష్ణు కుండబద్దలుగొట్టేశాడు. ఎవరు గెలిచినా, సినిమాల్లో అందరం కలిసి పని చేస్తామని చెప్పిన విష్ణు, ‘మా’ చుట్టూ ఇంత గందరగోళానికి కారణమైనవారి వల్లే తాను మరింత గట్టిగా పోటీలోకి రావాల్సి వచ్చిందని అన్నాడు. ఆ గందరగోళం వల్లనే మోహన్ బాబు కూడా తనను మరింతగా ప్రోత్సహించి ముందుకు నడిపించారని విష్ణు చెప్పుకొచ్చాడు.

సీనియర్ నటుడు బాబూ మోహన్ కూడా ‘విష్ణు’ ప్యానల్ తరఫున బరిలోకి దిగిన విషయం విదితమే. ‘మా’ అనేది చిన్న అసోసియేషన్ అనీ, అందరం కలిసి వుండాల్సింది పోయి.. ఎందుకీ విభేదాలని బాబూమోహన్ అభిప్రాయపడ్డారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వచ్చిన మాటలు సబబుగా లేవన్నది బాబూమోహన్ ఆరోపణ. నిజమే, ‘మా’ చుట్టూ కుల రాజకీయాల్ని, ప్రాంతీయ తత్వాల్నీ తెరపైకి తెచ్చారు కొందరు. ఈ క్రమంలో కొందరు సినీ ప్రముఖులు హద్దులదాటి వ్యాఖ్యలు చేశారు.. తీవ్రస్థాయి ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ అవసరమా.? అన్న అభిప్రాయం పలువురు సినీ ప్రముఖుల్లో వ్యక్తమయ్యింది. అసలే కరోనా దెబ్బకి సినీ పరిశ్రమ విలవిల్లాడింది.. విలవిల్లాడుతోంది కూడా. ఈ తరుణంలో అందరూ కలిసి వుండాల్సింది పోయి, ఈ గోలేంటి.? ఏమో, ఆ గోల సంగతి పక్కన పెడితే, విష్ణు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.. ప్రకాష్ రాజ్ మీద గెలిచేస్తానని కుండబద్దలుగొట్టేస్తున్నాడు కూడా. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.