Manchu Vishnu : చిరంజీవిపై మంచు విష్ణు ‘పర్సనల్’ కామెంట్స్.! ఏది నిజం.?

Manchu Vishnu : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై పరిశ్రమ బిడ్డగా చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. చర్చల అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

ఈ వ్యవహారంపై మంత్రి పేర్ని నాని ఆ మధ్య మాట్లాడుతూ, ‘స్నేహపూర్వక భేటీ మాత్రమే..’ అని తేల్చేశారు. చర్చలు ముఖ్యమంత్రి ఇంట్లో జరగవు కదా.? అధికారిక చర్చలైతే సచివాలయంలో జరుగుతాయ్.. అని పేర్ని నాని వ్యాఖ్యానించడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది.

కాగా, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా చిరంజీవి – వైఎస్ జగన్ భేటీని ‘పర్సనల్’ అని తేల్చేశారు. సినిమా టిక్కెట్ల ధరలు పెరగడం మంచిదా.? తగ్గడం మంచిదా.? అన్నదానిపై చర్చ జరగాలని సెలవిచ్చారు మంచు విష్ణు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాయనీ చెప్పుకొచ్చారాయన.

అయితే, సినిమా టిక్కెట్ల ధరల విషయమై ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. తక్కువ ధరలతో తమ సినిమాలకు వర్కవుట్ అవదని కొందరు నిర్మాతలు చెబుతున్న విషయం విదితమే. అదే సమయంలో ధరలు పెరిగితే, చిన్న సినిమాలకు ఇబ్బంది అనే భావన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది.

నెలల తరబడి ఈ వివాదం కొనసాగుతోంది. తద్వారా సినిమా విడుదలలూ ఇబ్బందుల్లో పడ్డాయి. అయినా, దీనిపై లోతైన చర్చ జరగాలనడం ఎంతవరకు సబబు.? ఏమోగానీ, చిరంజీవి – వైఎస్ జగన్ భేటీని.. ‘పర్సనల్’గా చూడటంలో మంచు విష్ణుకి వున్న పర్సనల్ ఎజెండా ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.