పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం విదితమే. అయితే, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాక ఆరు నెలల్లోగా ఆమె అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి వుంది. ఇదిలా వుంటే, పదవీ ప్రమాణ స్వీకారం సమయంలోనే గవర్నర్, మమతా బెనర్జీ మీద సెటైర్లు వేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింస, ఉద్రిక్త పరిస్థితుల్ని మమత ప్రభుత్వం అదపు చేయాలని ఆకాంక్షించారు.
అయితే, గవర్నర్ వ్యాఖ్యల పట్ల మమతా బెనర్జీ తనదైన స్టయిల్లో స్పందించారు. ఎన్నికల కమిషన్, గవర్నర్ వల్లే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు, హింస చోటు చేసుకున్నాయని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పరిపాలన తమ చేతుల్లోకి వచ్చింది గనుక, పాలనను గాడిలో పెడతామనీ, నేరాలకు ఆస్కారం లేకుండా పరిపాలన అందిస్తామనీ, అసాంఘీక శక్తుల్ని అణచివేస్తామనీ మమతా బెనర్జీ, గవర్నర్ సమక్షంలోనే వ్యాఖ్యనించారు. మరోపక్క, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింస నేపథ్యంలో మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నది బీజేపీ డిమాండ్. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింస చెలరేగింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. బీజేపీ కార్యకర్తల మీదనే దాడులు జరగాయంటూ కమలనాథులు వాపోతున్నారు. ముస్లిం, హిందువుల మధ్య హింస చెలరేగుతోందంటూ ఆరోపిస్తోన్న బీజేపీ, ఈ దాడులకు మమతా బెనర్జీనే కారణమని అంటోంది.