రెండు నెలలపాటు మమతా బెనర్జీకి విశ్రాంతి అవసరం.. అంటూ తొలుత ప్రచారం జరిగింది. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేయడానికి వెళ్ళి, అక్కడ జరిగిన తోపులాటలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, రెండు నెలలు అవసరం లేదు, ఓ రెండు వారాలు ఆమె తప్పక వైద్య పర్యవేక్షణలో వుండాలని తాజాగా ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి సమాచారం వస్తోంది. ఇక, తాను హాస్పిటల్ బెడ్‌కే పరిమితమైతే, రాజకీయాలెలా మారతాయో మమతా బెనర్జీకి బాగా తెలుసు. అందుకే, ఆమె త్వరగా ఆసుపత్రి నుంచి బయటకు వస్తానంటున్నారు. నడవలేని పరిస్థితి ఎదురైతే, వీల్ ఛెయిర్ మీద జనంలోకి వెళతాను తప్ప, ఇంట్లో గానీ ఆసుపత్రిలోగానీ ఊరికే కూర్చోనంటున్నారు. మమతా బెనర్జీని రాజకీయాల్లో ఐరన్ విమెన్‌గా అభివర్ణిస్తారు.
ఆమె ఉక్కు సంకల్పం అలాంటిది మరి. సరే, బీజేపీ ఆమెపై చేసే విమర్శల సంగతి వేరు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో మమతా బెనర్జీ పట్ల కొంత వ్యతిరేకత బెంగాల్‌లో ఖచ్చితంగా వుంటుంది. అది ఆమెకూ తెలుసు. ప్లాన్ చేశారో, అనుకోకుండా జరిగిందో.. కారణం ఏదైతేనేం, మమతా బెనర్జీ గాయపడ్డారు. ఇదైతే వాస్తవం. ఆమె గనుక వీల్ ఛెయిర్ మీద కూర్చుని ఎన్నికల ప్రచారానికి వెళితే, సింపతీ ఖచ్చితంగా వర్కువట్ అవుతుంది. మమతా బెనర్జీ కూడా అదే అంచనాతో వున్నారు. ‘సింపతీ’ సంగతి పక్కన పెడితే, వయసు సహా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మమతా బెనర్జీ కాలి గాయం నుంచి అంత తేలిగ్గా కోలుకునే అవకాశం లేదన్నది వైద్య నిపుణుల వాదన. ఇది బీజేపీకి నిజంగానే సంకటంగా మారింది. మమత పట్ల సెంటిమెంట్ పండితే, బీజేపీ ఆశలు బెంగాల్‌లో నెరవేరవు.