మమతా బెనర్జీ, మరోమారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయినా, తన పార్టీకి మాత్రం ఘన విజయాన్ని అందించారు. దాంతో ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇంకో వైపు, నందిగ్రామ్ నియోజవర్గంలో ఫలితాన్ని అధికారుల తారుమారు చేశారనీ, ఈవీఎంలు మార్చి రిగ్గింగ్ చేశారనీ మమతా బెనర్జీ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సి వుందన్నారు. అంతే కాదు, రీ-కౌంటింగ్ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేసేశారు. పార్టీని గెలిపించిన మమతా బెనర్జీ, తాను ఓడిపోవడం ఆమెను ఆశ్చర్యపరచడం మామూలే. అయితే, ఆమె ఎలా ఓడిపోతుంది.? అన్న చర్చ దేశ రాజకీయాల్లో జరుగుతుండడమే ఆసక్తికరం ఇక్కడ. నిజమే మరి, నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారికి బలం వున్న మాట వాస్తవం. అదే సమయంలో, మమతా బెనర్జీ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి.
మరీ బీజేపీ ప్రచారం చేస్తున్న స్థాయిలో అక్కడ మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత లేదు. ఏం జరిగిందోగానీ, నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. నిజానికి, ఆమె గెలిచినట్లు తొలుత వార్తలొచ్చాయి. గవర్నర్ కూడా ఆమెను అభినందించేశారట.. గెలిచినందుకు. మరి, ఎలా ఓడిపోయినట్టు.? ఇదే ఇప్పుడో పెద్ద మిస్టరీగా మారింది. మరోపక్క మమత ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అప్పుడే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న దరిమిలా, అవన్నీ బీజేపీ ప్రేరేపిత ఘటనలని మమత ఆరోపిస్తున్నారు. మరోపక్క, మమత కక్ష పూరిత రాజకీయాలు చేస్తుండడం వల్లే ఈ దాడులన్నది బీజేపీ వాదన.