మలయాళీ ముద్దుగుమ్మ వాణీ విశ్వనాథ్ @ 50

Vani Viswanath Birthday

Vani Viswanath Birthday : తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ వాణీ విశ్వనాథ్ గుర్తుంది కదా! త్రిశ్శూరుకు చెందిన ఈ మలయాళ భామ తెలుగులో అనతికాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. 1971, మే 13న త్రిశ్శూరు జిల్లా ఒల్లూరులో జన్మించిన వాణీ విశ్వనాథ్ తండ్రి విశ్వనాథ్‌ జ్యోతిష్కుడు కావడంతో చిత్రసీమకు చెందిన వారు కూడా మద్రాసులో ఆయన వద్దకు జ్యోతిష్యం చెప్పించుకోవటానికి వస్తూ తొమ్మిదో తరగతి చదివే వాణిని చూసి మొహమాటపెట్టి శివాజీ గణేశన్‌ మనవరాలిగా ‘మన్నుక్కుల్‌ వైరం’లో వితంతు పాత్రలో నటింపచేసారు.

బాల్య వివాహాలకు సంబంధించిన ఈ చిత్ర ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణీ బాధపడితే, మంచి మేకప్‌తో ఆ సినిమాలో ఒక డ్రీమ్‌సాంగ్‌ పెట్టారు. ఈ చిత్రం విజయం సాధించింది. 14వ ఏట విజయకాంత్‌ చిత్రంలో నటిస్తుండగా జగపతి బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సింహస్వప్నం’ 1989లో హీరోయిన్‌గా తెలుగులో అవకాశం వచ్చింది. ‘ఘరానా మొగుడు’ చిత్రంతో గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి పేరొచ్చింది. ‘నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్‌ స్పెషల్‌, జోకర్‌, ప్రేమ అండ్‌ కో, రైతుభారతం’ తదితర తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

అందమైన పలు వరుసతో అలరించే నవ్వు, కోలముఖం, తీరైన శరీర సౌష్ఠవంతో స్లిమ్‌ పెర్సనాల్టి వాణీ విశ్వనాథ్‌ హీరోయిన్‌ కావడానికి తోడ్పడ్డాయి. గ్లామర్‌, సెక్స్‌ అప్పీల్‌ ఆమె చిత్రాల సంఖ్యను పెంచాయి. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన వాణీ విశ్వనాథ్‌కు 1995లో తెలుగులో ఫిలిం కెరీర్‌లో బ్రేక్‌ వచ్చి, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీ అయింది. గుర్రపు స్వారీ, స్టంట్స్‌ కూడా నేర్చుకుని విజయశాంతి తరహా చిత్రాలు, నెగెటివ్‌ షేడ్స్‌ వున్న చిత్రాలు, ఆఫ్‌బీట్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు 2002వరకు చేసింది. 2002లో ప్రతినాయక పాత్రలు పోషించే మలయాళీ నటుడు బాబూరాజ్‌ని పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడింది. 2002 నుండి 2005వరకు గృహిణిగా గడిపింది.

ఈమెకు చెన్నైలో ఒక పాప పుట్టింది. కేరళ జానపద గాథలలో వీరవనిత అయిన ఉన్ని అర్చ పేరు మీదుగా అర్చ అని నామకరణము చేశారు. వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో పి.జి.విశ్వాంభరన్ దర్శకత్వములో ఒక సినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించింది. 2005లో ‘ఇది య తిరుడన్‌’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ నటిగా ప్రారంభించింది. మళ్ళీ కొంత గ్యాప్‌ వచ్చింది ఫిలిం కెరీర్‌కి. భర్త బాబూరాజ్‌ దర్శకత్వంలో పోలీస్‌ ఆఫీసర్‌గా ‘బ్లాక్‌ డాలియా’లో నటించి థర్డ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, మలయాళీ చిత్రసీమలో ఇప్పటికీ గ్లామర్‌ స్టార్‌గా, స్టంట్‌ క్వీన్‌గా రాణిస్తోంది. అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో ‘రత్నావళి’ చిత్రంలో మళ్ళీ తెలుగు చిత్రసీమలోకి వాణీ విశ్వనాథ్‌ ప్రవేశించింది.

వాణీ విశ్వనాధ్ నటించిన తెలుగు చిత్రాలు : ఆయుధం (1990), అలెగ్జాండర్ (1992 సినిమా), ఆడపిల్ల, కొదమసింహం, ఘరానా మొగుడు, చిన్న కోడలు, చిన్నల్లుడు, జోకర్, దొంగల్లుడు, ప్రేమ ‍‍‍అండ్ కో, ప్రేమ చిత్రం – పెళ్లి విచిత్రం, మా ఇంటి కథ, మా ఇంటి మహరాజు, మామా కోడలు, ముద్దు, సర్పయాగం, రైతు భారతం, రౌడీయిజం నశించాలి, లేడీస్ స్పెషల్, వదినగారి గాజులు, సామ్రాట్ అశోక్, సింహస్వప్నం, కలెక్టర్ గారి అల్లుడు, ఒరేయ్ బుజ్జిగా (2020). ఇలా ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నవాణీవిశ్వనాథ్ 2002లో బాబురాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం అప్పడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంలో చిరంజీవితో నటించి గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఆ సినిమాలో చిరంజీవి-వాణీవిశ్వనాథ్ ల వానపాట యువతరం గుండెల్లో ఇప్పటికీ అలజడులు రేపుతూనే ఉంది.