శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి విద్యుత్ కేంద్రంలో ఉన్న ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో మంటలు రావడంతో విద్యుత్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద ఉన్న ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఈ ప్రమాదం సంభవించింది.
విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో మంటలు వ్యాపించి పొగలు కమ్ముకోవడంతో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో 19 మంది జెన్కో సిబ్బంది రాత్రి మంటల్లో చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్ వారిలో 10 మందిని కాపాడింది. మరో 9 మంది కోసం గాలిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల 30 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరు మంటలు వ్యాపించగానే సొరంగ మార్గం ద్వారా బయటికి వచ్చేశారు.
ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం కేసీఆర్
విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావును ఘటన గురించి అడగగా.. ఆయన స్పందించారు. గురువారం రాత్రి 10.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 1200 కేవీ లైన్ ను ఐసోలేట్ చేసే సమయంలో ట్రిప్ అయి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ కేంద్రంలో ఉన్న ఆరు యూనిట్లలో పొగ వ్యాపించింది. అక్కడ చిక్కుకున్న సిబ్బందిని రక్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నామని..ప్రభాకర్ రావు సీఎంకు వెల్లడించారు.