దాదాపు 14 రోజులపాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కత్తి మహేష్, మృత్యువుతో పోరాటంలో ఓడిపోయాడు. గత నెలాఖరున నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. సినీ నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు కూడా అయిన కత్తి మహేష్, తక్కువ కాలంలోనే అనూహ్యమైన పాపులారిటీ దక్కించుకున్న విషయం విదితమే.
కత్తి మహేష్ ఇంతలా పాపులారిటీ దక్కించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ఒకరు పవన్ కళ్యాణ్, ఇంకొకరు శ్రీరాముడు. పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ పాపులారిటీ పెంచుకున్నాడు కత్తి మహేష్. అదే సమయంలో, ఆయన శ్రీరాముడ్ని కూడా టార్గెట్ చేశాడు. అలా హైద్రాబాద్ నుంచి నగర బహిష్కరణకు కూడా కత్తి మహేష్ గురవడం గమనార్హం. నో డౌట్, కత్తి మహేష్ మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. విషయ పరిజ్ఞానం వున్నోడు కూడా.
విద్యాధికుడూ అయిన కత్తి మహేష్, తాను నేర్చుకున్న విద్యనీ, తాను తెలుసుకున్న జ్ఞానాన్నీ.. కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడానికే వాడుకున్నాడు. అదే అతను చేసిన అతి పెద్ద తప్పు. ఎదిగాడు, కానీ దిగజారిపోయాడు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనగానే, ఆయన కోసం మీడియా పరిగెత్తాలి. కానీ, అలాంటిదేమీ జరగలేదు.
పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి పనిగట్టుకుని కొన్ని న్యూస్ ఛానళ్ళు ఆయన్ని ప్రత్యేకంగా పిలిచేవి.. ఈ క్రమంలో పెద్ద మొత్తం రెమ్యునరేషన్ కూడా ఆయనకు ఇచ్చేవంటారు. ఏమయ్యాయి ఆ మీడియా సంస్థలన్నీ.? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
కత్తి మహేష్ తుది శ్వాస విడిచాడనగానే, ఆ వార్తని బ్రేకింగులుగా మార్చేసి, కాస్సేపు హడావిడి చేసి న్యూస్ ఛానళ్ళు చేతులు దులిపేసుకున్నాయి. అంతేనా, ఇక్కడా పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకున్నారంటూ, కత్తి మహేష్ మరణాన్ని సైతం అడ్డు పెట్టుకుని మీడియా సంస్థలు రాజకీయం చేస్తుండడం గమనార్హం.