తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విశాల్. అయితే గత కొన్ని రోజులుగా ఈయనపై ఓ కేసు నడుస్తుంది. అంతకు ముందు ఓ సినిమాకు వచ్చిన నష్టాలను భర్తీ చేయాలంటూ సదరు నిర్మాత విశాల్ పై హైకోర్టులో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. యాక్షన్ హీరో విశాల్, మిల్కీబ్యూటి తమన్నా హీరో హీరోయిన్లుగా “యాక్షన్” అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సినీ నటి ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శకుడు సి సుందర్ దర్శకత్వం వహించాడు. అయితే సినిమా బాగున్నప్పటికీ అనుకున్నంత ఆడలేదు. దాంతో సినిమా వల్ల.. భారీగా నష్టపోయిన సినీ నిర్మాతకు.. హీరో విశాలే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. వాస్తవానికి దర్శకనిర్మాతలు ఈ సినిమాను ముందుగా తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ భారీగా ఖర్చు పెరిగింది. ఈ క్రమంలో ఈ సినిమా రూ.20 కోట్ల కలెక్షన్లు వసూలు చేయకపోతే.. ఆ నష్టాన్ని తానే భరిస్తానని హీరో విశాల్ నిర్మాత ఆర్ రవింద్రన్‌కు హామీ ఇచ్చాడు. ఆయన హామీతో సినీ నిర్మాత రవీంద్రన్ రూ.44 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పూర్తి చేశారు.
అయితే ఈ సినిమా విడుదలైన తరువాత హీరో విశాల్, నిర్మాత రవీంద్రన్‌కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల వసూళ్లు మాత్రమే చేసింది. దాంతో ఖంగుతిన్న నిర్మాతలు హీరో విశాల్ ను ఆశ్రయించారు. దానికి విశాల్ స్పందిస్తూ.. భయపడవద్దని తన తర్వాతి సినిమా కూడా మా బ్యానర్ లోనే చేస్తానని మాటిచ్చాడు. కానీ తన స్వంత బ్యానర్ లోనే చక్ర అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిర్మాత రవీంద్రన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిర్మాత రవీంద్రన్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం మద్రాస్ న్యాయస్థానం విచారణ జరిపి.. “యాక్షన్” సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతకు విశాల్ పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ మేరకు రూ.8.29 కోట్ల నష్టాన్ని భర్తీ చేసే విధంగా విశాల్, నిర్మాతకు హామీ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.