గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ నటుడు శివబాలాజీ, ఆయన భార్య మధుమిత ఓ ప్రైవేటు స్కూల్ పై పోరాడుతున్నారు. ట్యూషన్ ఫీజు విషయంలో వచ్చిన గొడవ వల్ల తమ పిల్లలను ఆన్ లైన్ క్లాసులు విననివ్వడం లేదంటూ శివబాలాజీ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ మణికొండలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో శివబాలాజీ పిల్లలు చదువుతున్నారు. అయితే.. ట్యూషన్ ఫీజు 50 శాతం తీసుకోవడం లేదని.. పూర్తిగా కట్టాలంటున్నారని.. శివబాలాజీ దంపతులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో… వాళ్లు పిల్లలను స్కూల్ గ్రూపుల నుంచి తీసేశారని ఆరోపించారు. ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా తమ పిల్లలను ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని.. ఎలాగైనా స్కూల్ గుర్తింపు రద్దు అయ్యే వరకు పోరాడుతామని వాళ్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన మధుమిత.. భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు.
సీఎం కేసీఆర్ గారు.. స్కూల్ యాజమాన్యం.. విద్యార్థుల్ని ఇష్టమున్నట్టు తీసేస్తుంటే హెచ్చార్సీకి ఫిర్యాదు చేశాం. జీవో 46ను స్కూళ్లు పట్టించుకోవడం లేదు. జీవో 193 ప్రకారం ట్యూషన్ ఫీజు 50 శాతమే ఉండాలని మీరు కూడా చెప్పారు. కానీ.. పాఠశాల యాజమాన్యం.. 100 శాతం కట్టాలంటూ మమ్మల్ని వేధిస్తున్నారు. 40 శాతం ఫీజులు కట్టినా.. మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసేశారు. నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసేసేసరికి చలించిపోయాను. ఇక మా వల్ల కాదు.. కేసీఆర్ సార్.. మీరే ఎలాగైనా ఆదుకోవాలి. చొరవ తీసుకోవాలి. మీరు దృష్టి సారిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లక్షల మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయండి.. అంటూ మధుమిత వేడుకున్నారు.