మంచు విష్ణు యాక్షన్ ప్లానేంటీ.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించాడు. సీనియర్ నటుడు నరేష్ టెర్మ్ ముగిసింది. ఇక ఇప్పుడు ‘మా’ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు.? అసోసియేషన్‌ను ఎలా నడపబోతున్నాడు.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఓ పక్క ఎన్నికల రగడ ఇంకా కొనసాగుతున్నా, మంచు విష్ణు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. పెన్షన్లకు సంబంధించి తొలి సంతకం చేసేశాడట. నిజానికి మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాకా చేయాల్సిన తొలి సంతకం, తొలి ప్రకటన మా భవనం గురించే జరగాలి.

ఎందుకంటే, ఎన్నికల ప్రచారంలో ‘మా’ భవనం అంతలా చర్చనీయాంశమైంది కనుక. కోట్ల రూపాయలు వ్యత్యిస్తే తప్ప ‘మా’ భవనం నిర్మితమయ్యే అవకాశం లేదు. తన సొంత సొమ్ము వ్యత్యించి, కుటుంబ సభ్యుల సహకారంతో ‘మా’ భవనాన్ని నిర్మిస్తాననీ, ఇందుకోసం స్థలాన్వేషణ కూడా చేశాననీ ఎన్నికలకు ముందు చెప్పాడు విష్ణు. సో దీనిపై విష్ణు సమాధానం దాటవేస్త కుదరదు.

ఇదిలా ఉంటే, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేయడంతో వారి స్థానంలోకి కొత్తగా విష్ణు ఎవరిని తీసుకుంటాడనేదే చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మా సభ్యులు నాగబాబు, ప్రకాష్ రాజ్ చేసిన రాజీనామాల పైనా అధ్యక్షుడిగా మంచు విష్ణు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ రాజీనామాల్ని ఆమోదించేది లేదని ఇప్పటికే విష్ణు చెప్పగా, రాజీనామాల నుంచి వెనక్కి తగ్గేది లేదని నాగబాబు తెగేసి చెప్పారు.

ఇంకో పక్క మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు తన మీద వస్తున్న రౌడీయిజం, బూతుల దాడి విమర్శలకు సమాధానం చెప్పుకోవల్సి వుంది. నిజానికి మంచు విష్ణుకు అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆయన ముందు చాలా సమస్యలతో పాటు, చాలా లక్ష్యాలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తాడో విష్ణు చూడాలిక.