ప్రకాష్ రాజ్ ప్రశ్న: ‘మా’ ఎన్నికల్లో వైసీపీ రౌడీ షీటర్‌కి పనేంటి.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ షీటర్‌కి పనేంటి.? అన్నది సినీ నటుడు ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న. ‘మా’ ఎన్నికల అధికారికి ఈ మేరకు ప్రకాష్ రాజ్ ఓ లేఖ రాశారు. సినీ నటుడు మోహన్ బాబు వెంట రౌడీ షీటర్ నూకల సాంబశివరావు ‘మా’ ఎన్నికల సమయలో వున్నారన్నది ప్రకాష్ రాజ్ ఆరోపణ.

నూకల సాంబశివరావు వైసీపీ మద్దతుదారుడని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.. అవే ఫొటోల్ని ‘మా’ ఎన్నికల అధికారికీ లేఖతోపాటుగా ప్రకాష్ రాజ్ పంపించడం గమనార్హం.

‘మా’ ఎన్నికల నేపథ్యంలో పెద్ద గలాటా చోటు చేసుకున్న మాట వాస్తవం. మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన శివబాలాజీ చెయ్యి కొరికింది సినీ నటి హేమ (ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసింది). కాగా, మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు, తమ ప్యానెల్ సభ్యులపై బూతులు తిట్టారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన బెనర్జీ, తనీష్ తదితరులు, మోహన్ బాబు తమను దూషించిన తీరుపై కంటతడి పెట్టారు కూడా. తిట్లు మాత్రమే కాదు, కొట్టడాలు కూడా జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల పరంపరలో ఇప్పుడు ఏకంగా రౌడీ షీటర్ పేరు తెరపైకొచ్చింది.

ఈ రౌడీ షీటర్.. అందునా వైసీపీ రౌడీ షీటర్.. అంటూ ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న దరిమిలా, నూకల సాంబశివరావుకీ మోహన్ బాబుకీ సంబంధమేంటి.? ఆ నూకల సాంబశివరావుకి ‘మా’లో సభ్యత్వం వుందా.? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి వుంది.

ఒకవేళ సభ్యత్వం లేకపోతే మాత్రం.. ఇదో పెను దుమారానికి కారణమయ్యేలా వుంది. టైమ్ తీసుకుని ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మీదకి ఇలా ‘యార్కర్’ సంధించిన దరిమిలా.. ముందు ముందు ‘మా’ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచాక కూడా మంచు విష్ణుకి ఈ తలనొప్పులేమిటో.!