మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రగడ: ఇంతకీ ఎవరు లోకల్ ఇక్కడ.?

MAA Elections

MAA Elections

తెలుగు సినీ పరిశ్రమ చెన్నయ్ కేంద్రంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత హైద్రాబాద్ రావడానికి చాలా తంటాలు పడింది. ఎలాగైతేనేం, హైద్రాబాద్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది తెలుగు సినీ పరిశ్రమకి కొన్నేళ్ళ క్రితం నుంచీ.

ఇప్పటికీ, చాలామంది సినీ ప్రముఖులు చెన్నయ్ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న యువతరం నటీనటుల్లో చాలామంది (కేవలం తెలుగు నటీనటుల్నే తీసుకుంటే) చెన్నయ్ నగరంలో పుట్టినవారున్నారు.

అక్కడే చదువుకున్నవారున్నారు. మరి, ఎవర్ని లోకల్.? ఎవర్ని నాన్ లోకల్.? అని పిలవగలం.! లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే చర్చ వస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రపదేశ్, తెలంగాణ గురించి వేర్వేరుగా మాట్లాడుకోవాలి.

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్ నగరంలో వుంది గనుక, ఆ హైద్రాబాద్ తెలంగాణలో వుంది గనుక.. కేవలం తెలంగాణలో పుట్టి పెరిగిన వారే లోకల్ అనాలేమో. ఈ స్థాయికి తెలుగు మీడియా, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల వ్యవహారాన్ని దిగజార్చేసింది. ‘మగ వర్సెస్ మగువ’ అంటూ చర్చాకార్యక్రమాల్ని ‘బురద సమాజం కోసం’ నిర్వహిస్తోంది తెలుగు మీడియా. ఇక్కడే, తెలుగు సినీ పరిశ్రమ విజ్నతని ప్రదర్శించాల్సి వుంది.

మీడియాకెక్కి రచ్చ చేసుకోవడం వల్ల ఉపయోగమేమీ వుండదు. ఇది కేవలం వెయ్యి మంది సభ్యులు కూడా లేని ఓ చిన్న అసోసియేషన్ అంతే. అది కూడా నటీనటుల అసోసియేషన్. ప్రముఖులుగా చెప్పబడుతున్న కొందరు సినీ జనాలు, తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ‘మా’ ఔన్నత్యాన్ని దిగజార్చేస్తున్నారు. చిరంజీవి లాంటి పరిశ్రమ పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దకపోతే.. సినీ పరిశ్ర మొత్తంగా మహా పలచనైపోతుంది జనంలో.. ఈ మీడియా చర్చా కార్యక్రమాల కారణంగా.