ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కదా. ఎల్ఆర్ఎస్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్రమమైన, అనధికార లేఅవుట్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు 31న ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టగా… అక్టోబర్ 15 వరకు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అక్టోబర్ 15 వరకు అందరూ దరఖాస్తు చేసుకోవాలని.. ఎవరైతే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోరో.. ఆయా ప్లాట్ల తదుపరి అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరగదని… ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతులు జారీ చేయడం కుదరదని ప్రభుత్వం వెల్లడించింది.
దీంతో అందరూ వెంటనే ఎల్ఆర్ఎస్ కు అప్లయి చేసుకోవడం మొదలు పెట్టారు. అక్టోబర్ 15 వ తేదీ వరకు సుమారుగా 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ చివరి తేదీని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అప్లయి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.