టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా లేఖలు రాయడం మొదలు పెట్టారు. ముందుగా సీఎం ఏడాది పాలనను ఉద్దేశించి నేరుగా సీఎం జగన్ కే ఓ లేఖ రాసారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. అటుపై ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ కు ఒక లేఖ…రాష్ర్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరో లేఖను రాసారు. వీటన్నింటిలో కామన్ పాయింట్ ఒకటే. జగన్ ఏడాది పాలన…రౌడీల రాజ్యం అంటూ హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఒక్క జగన్ కు రాసిన లేఖలోనే విమర్శలు తక్కువగా ఉన్నాయి. మరి దీనిక వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటన్నది తెలియదు గానీ! వ్యూహం అయితే కచ్చితంగా ఉంటుంది.
రాజకీయాలు లేకుండా చంద్రబాబు ఊరకనే కంప్యూటర్ కాలంలో లేఖలెందుకు రాస్తారు? అన్న అనుమానమైతే వైకాపా నేతలకు ఉంది. ఆ దిశగా కొంత మంది వైకాపా నేతలు విమర్శలు చేసారు. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అలియాస్ చినబాబు కూడా తండ్రి దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ కు చినబాబు ఓ లేఖ రాసారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేఖలో కోరారు. అధికారంలోకి రాగానే ఇసుక నూతన పాలసీ అంటూ నాలుగు నెలలు తాత్సానం చేసారని విమర్శించారు. అందువల్ల 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
కొత్త పాలసీ వల్ల నిర్మాణ రంగం కుప్పకూలిందని ఆరోపించారు. ఇసుక మాఫియా ఏ స్థాయిలో జరుగుతుందో తాజాగా ఓ మంత్రికి ఇసుకకు బధులు మట్టిలారీ పంపించడంతోనే బహిర్గతమమైందని లేఖలో పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికుల ను పలు రాష్ర్టాలు ఆదుకున్నాయని, కానీ జగన్ సర్కార్ మాత్రం ఆదుకోలేదని లేఖలో ఆరోపించారు. తక్షణం కార్మిక సంఘాల నాయకులతో సంక్షేమ మండలి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అయితే లోకష్ ఈ లేఖ రాయడం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని అంటున్నారు. పెదబాబు సలహా మేరకే చినబాబు లేఖ రాసారని రాజకీయ వర్గాల టాక్. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ప్రభుత్వానికి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.