తెలంగాణ రాష్ట్రంలో నేటి ఉదయం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దాంతో, ఆంధ్రపదేశ్ – తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు పోటెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిజానికి, ఆంద్రపదేశ్‌లో గత కొన్ని రోజులుగా 18 గంటల కర్ఫ్యూ నడుస్తోంది. తెలంగాణలో తాజాగా 20 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. పేరులో చిన్న మార్పు అంతే. ఏపీలో కర్ఫ్యూ, తెలంగాణలో లాక్‌డౌన్.. మిగతాదంతా సేమ్ టు సేమ్. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది హైద్రాబాద్‌లో స్థిరపడటమో, లేదంటే వివిధ మార్గాల్లో ఉపాధి పొందుతుండడమో జరుగుతోంది చాలా ఏళ్ళుగా. తెలంగాణలో లాక్‌డౌన్ అనగానే, ఏపీకి చెందిన చాలామంది సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్ళకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే జాతీయ రహదార్లపై భారీ రద్దీ నెలకొంది.
అయితే, అలా వచ్చేవారి వల్ల ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, తెలంగాణతో పోల్చితే ఆంధ్రపదేశ్‌లోనే రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ. దాంతో, కొందరికి ఆంధ్రపదేశ్ వెళ్ళాలని మనసులో వున్నా, వాళ్ళు ఏపీకి వెళ్ళలేని పరిస్థితి. ఇంకోపక్క, వైద్య చికిత్స నిమిత్తం హైద్రాబాద్ రావాల్సినవారు, ఏపీలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంబులెన్సుల్ని సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు నిన్న మొన్నటిదాకా ఆపేయడమే అందుక్కారణం. అయితే, హైకోర్టు జోక్యంతో ఆ సమస్య తీరినా, ప్రజల్లో ఆందోళన మాత్రం అలాగే వుంది. ఆంధ్రపదేశ్‌లో 18 గంటల కర్ఫ్యూ.. అంటే తెలంగాణలో ఎవరికీ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ, తెలంగాణలో లాక్‌డౌన్ అనగానే, ఏపీ నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో తెలంగాణ నుంచి వచ్చేవారి పట్ల కొంత అనుమానాస్పదంగా చూస్తున్నారు. కరోనా టెస్టులు చేయించుకుని రమ్మంటూ ఆయా గ్రామాల్లో తెలంగాణ నుంచి వచ్చేవారికి ఛీత్కారం ఎదురవుతుండడం గమనార్హం.