అది శ్రీకాకుళం జిల్లాలోని పలాస మునిసిపాలిటీ. అధికార పార్టీనే దక్కించుకుంది మునిసిపాలిటీ చైర్మన్ పదవిని.. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో. కానీ, అందులో కొన్ని వార్డులు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి దక్కాయి. తన భార్యను ఓ వార్డులో ఓడించారన్న కారణంగా వైసీపీ నేత, మునిసిపల్ ఛైర్మన్ బల్ల గిరిబాబు.. సదరు వార్డులో ఎవరికీ సంక్షేమ పథకాలు అందే ప్రసక్తే లేదని తేల్చేశారు. వాలంటీర్లెవరూ ఆ వార్డులోకి వెళ్ళకూడదని ఆదేశించేశారు. చిత్రమేంటంటే, ఈ వార్డులో వైసీపీ మద్దతుదారులకు కూడా సంక్షేమ పథకాలు దక్కబోవట. ‘ఏం చేస్తాం.? టీడీపీని గెలిపించారు కదా.
ఆ కౌన్సిలర్ దగ్గరకే వెళ్ళండి.. మేం మాత్రం, సంక్షేమ పథకాల్న అందనివ్వబోం. వాంటీర్లను కూడా అటువైపు వెళ్ళనివ్వం..’ అని తేల్చేశారు. ‘మేం పార్టీలు చూడం.. కులాలు చూడం, మతాలు చూడం.. అందరికీ సంక్షేమ పథకాల్ని అందిస్తాం..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. కానీ, కింది స్థాయిలో పరిస్థితులు వేరేలా వున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడొచ్చుగాక. కానీ, ఎన్నికలయ్యాక ఇలా చేస్తే ఎలా.? అన్నది సాధారణ ప్రజల ఆవేదన. ‘దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడంలేదు..’ అన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోతోంది. ఇది అధికార వైసీపీకి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి. కింది స్థాయి నేతల కారణంగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తోందంటూ, స్థానికంగా కొందరు వైసీపీ నేతలు వాపోతున్నారు.. అంతేకాదు, ఈ తరహా వ్యవహారాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లేందుకూ ప్రయత్నిస్తున్నారు. పెన్షన్లు అందరికీ అందుతున్నాయి.. వివిధ సంక్షేమ పథకాలూ అందరికీ చేరువవుతున్నాయి. ఒకటి రెండు చోట్ల వైసీపీ నేతల అత్యుత్సాహం అధికార పార్టీకి చెడ్డపేరు తెస్తోన్న దరిమిలా, ముఖ్యమంత్రి తనంతట తానుగా రంగంలోకి దిగి, పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తే తప్ప, పరిస్థితులు అదుపులోకి రావేమో.