‘స్థానిక’ రాజకీయం: సాధారణ ఎన్నికల్ని మించి ఎందుకీ హంగామా.?

పంచాయితీ, నగరపాలక సంస్థల ఎన్నికలు కావొచ్చు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావొచ్చు.. వీటిని సాధారణ ఎన్నికలు.. అంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మించిన హంగామాతో రాజకీయ పార్టీలు ఎందుకు భావిస్తున్నట్టు.? వందల కోట్లు సైతం గుమ్మరించేందుకు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇటీవలి కాలంలో ఏ చిన్న ఎన్నిక జరిగినా.. అది లక్షల్లో కాదు, కోట్లతో ముడిపడి వున్న వ్యవహారంగా మారిపోయింది. తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయనేది ఓ అంచనా. 6 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలదాకా రాజకీయ పార్టీలు సమర్పించుకోవాల్సి వచ్చింది ఒక్క ఓటరుకీ ఇక్కడ.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కావొచ్చు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కావొచ్చు.. పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది బరిలో వున్న ప్రధాన రాజకీయ పార్టీలు. కుప్పం, నెల్లూరు సహా రాష్ట్రంలో తాజాగా జరిగిన పలు స్థానిక ఎన్నికల్లోనూ అనూహ్యంగా రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే.

తిరుపతి, బద్వేలు ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్లను తీసుకొచ్చినట్టే, కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల కోసం కూడా దొంగ ఓటర్లను తీసుకొచ్చాయి రాజకీయ పార్టీలు. ఇంత దారుణమా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారుగానీ.. ఆ జనంలోనే చాలామంది రాజకీయ పార్టీలు పెట్టే ప్రలోభాలకు లోనవుతున్నారన్నది నిష్టురసత్యం.

స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అధికారంలో వున్న పార్టీలకు సహజంగానే అడ్వాంటేజ్ వుంటుంది. ఇక్కడ విపక్షాలు ప్రతిష్టకు పోతే, అధికార పార్టీ మరింత ప్రతిష్టకు పోవడం ఖాయం. అదే అన్ని సమస్యలకీ ప్రధాన కారణం. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో.. కోట్లు ఖర్చు చేసి గెలిచామని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఏ పార్టీకి అయినా.?