Viral: వరండాలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుత దాడి..! వీడియో వైరల్

Viral: అటవీ ప్రాంతాల్లో అడవి మృగాలు ఒక్కోసారి జనావాసాల్లోకి చొరబడటం గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. ఇలా చాలా మృగాలు జనారణ్యంలోకి వచ్చాయి. దొరకిని పశువులు, జంతువులను.. ఒక్కోసారి మనుషులపై కూడా దాడి చేసి చంపేసిన ఘటనలు జరిగాయి. అటువంటి సంఘటనే మహారాష్ట్రలో నిన్న రాత్రి జరిగింది. అర్ధరాత్రి ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులి.. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ పెంపుడు కుక్కను నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని భూస్ గ్రామంలో జరిగిందీ సంఘటన. ఓ ఇంటి ఆరుబయట పెంపుడు కుక్క నిద్రిస్తోంది. ఎంతో చాకచక్యంగా నెమ్మదిగా.. ఎటువంటి చప్పుడు లేకుండా వచ్చిన చిరుత నిద్రిస్తున్న కుక్కను చూసింది. అంతే నెమ్మదిగా వెళ్లి కుక్క మెడను నోట కరచింది. అంత నెమ్మదిగా చిరుత చేసిన దాడికి కుక్క పెనుగులాడినా చిరుత బలం ముందు నిలవలేదు. కుక్కను నోట కరచుకున్న చిరుత అలానే అడవిలోకి వెళ్లిపోయింది. ఇందుకు సంభంధించిన వీడియోను ఏఎన్ఐ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

‘అడవులే జనారణ్యాలుగా మారిపోతుంటే చిరుతలు రాకుండా మరేం చేస్తాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే నాసిక్ జిల్లాలో దిండోరి ఎంపీ భారతీ పవర్ నివాసంలోకి చిరుత ప్రవేశించడం అప్పట్లో కలకం రేపింది. అటవీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈక్రమంలో ఓ అటవీ అధికారి గాయపడ్డారు కూడా. ప్రస్తుత ఘటనలో ఆ ఇంటి ఆవరణలో వాచ్ మెన్ లేకుండా కుర్చీ మాత్రమే ఉంది. వాచ్ మెన్ ఉండుంటే అనే పరిస్థితే ఇప్పుడు గ్రామవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.