పవర్ స్టార్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పరిస్థితులు అనుకూలించక, కొన్ని అడ్డంకుల వలన సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు కానీ లేకుంటే రికార్డ్ కలెక్షన్స్ నమోదయ్యేవే. ఈ సినిమాతో వేణు శ్రీరామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ‘వకీల్ సాబ్’కు సీక్వెల్ తీయమని పవన్ అభిమానులు ఆయన్ను కోరుతున్నారు. వేణు శ్రీరామ్ కూడ అందుకు సుముఖంగానే ఉన్నారు. మంచి కథ రాసుకుని రంగంలోకి దిగుతాను అంటున్నారు. పవన్ గనుక సీక్వెల్ చేయడడానికి ఒప్పుకుంటే దిల్ రాజే నిర్మాత.
ఇవన్నీ పక్కనపెడితే అసలు పవన్ దగ్గర సీక్వెల్ చేసేంత టైమ్ ఉందా అనేదే పెద్ద ప్రశ్న. కోవిడ్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకున్న ఆయన ఇంకో రెండు నెలలు బయటికిరారు. అంటే ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇంకో రెండు నెలలు వెనక్కి వెళ్ళినట్టే. పవన్ తిరిగి సెట్స్ మీదకు వస్తే రెండు సినిమాలను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మలయాళం రీమేక్ ఒకటి, ‘హరిహర వీరమల్లు’ రెండవది. ఈ సినిమాలు అయ్యేసరికి సెప్టెంబర్ అయ్యేలా ఉంది. వాటి తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుంది. అది కాకుండా ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలంతా ఆయన డేట్స్ కోసం చూస్తున్నారు.
‘వకీల్ సాబ్’ సీక్వెల్ చేయాలి అంటే వీటిలో ఏదో ఒక సినిమాను వెనక్కు నెట్టక తప్పదు. అలా చేస్తే ముందుగా మాట తీసుకున్న నిర్మాతలు నొచ్చుకుంటారు. పైపెచ్చు సీక్వెల్స్ మీద పవన్ ఎప్పుడూ అంత ఆసక్తి చూపినవారు కాదు. గతంలో ‘గబ్బర్ సింగ్’ ఫ్లేవర్ మీద వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంతగా ఆడలేదు. సో.. ఆచరణలో ‘వకీల్ సాబ్-2’ అనేది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు.