2019 ఎన్నికలతో తేదాపా బలం ఎంతో తేలిపోయింది. జగన్ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. 151 సీట్లు వైకాపా సాధిస్తే…23 సీట్లు టీడీపీ సాధించింది. ఆ 23 మందిలో 3గురు ఇప్పటికే వైకాపా కు మద్దతిస్తున్నారు. రేపో మాపో రాజీనామా చేసి వైకాపా కండువా కప్పబోతున్నారు. ఇది ఖరారైన తర్వాత మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగడానికి సిద్దంగా ఉన్నారు. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే, ఆ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు సైతం ఇప్పుడు సైకిల్ దిగడానికి రెడీగా ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు రానున్నారు! అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
విశాఖను పరిపాలన రాజధానిగా మార్చడంతో ఉత్తరాంధ్ర జిల్లా వాసులంతా జగన్ కే జై కొట్టారు. కర్నూలు జ్యుడిషీయల్ క్యాపిటల్ గాను అవతరించడంతో రాయల సీమ అంతా జగన్ వెంటనేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో బలమైన పార్టీగా వైకాపా ఆవిర్భవించింది. కర్నూలు రాజధాని చేయడంతో సీమలో జగన్ కు బలం పెరిగిందిప్పుడు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక సామాజిక వర్గం అభివృద్ధి కోసమే అన్న అంశం పై ఉత్రాంధ్ర మూడు జిల్లాలు..రాయలసీమ నాలుగు జిల్లాల వాసులు భగ్గుమన్నారు. ఇలా ఏడు జిల్లాల ప్రజలు జగన్ కు నర్మగర్భంగా జై కొట్టారు. ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లా లో వైకాపాకు బలమైన నాయకులున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అమరావతి రాజధాని విషయంలో కాస్త వ్యతిరేకత వ్యక్తమైనా ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో వైకాపాకు బలమైన నాయకులున్నారు. ఇలా మొత్తంగా ఓ రివ్యూ చేస్తే వైకాపా బలం గట్టిగానే ఉంది. ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది..ఈ లోపు ఆ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించి జగన్ తనవైపు కు తిప్పుకునే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే! టీడీపీ కి రానున్నది అంతా గడ్డుకాలంగా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉంది. సీనియర్ నేతలంతా అరెస్ట్ అవుతున్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ నుంచి చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
అదే జరిగితే అన్ని జిల్లాల్లో పార్టీ మరింత బలహీన పడుతుంది. ప్రస్తుతం తేదాపా బలం ఎంత అన్నది తేలాలంటే స్థానిక ఎన్నికల వరకూ ఎదురు చూడాల్సిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ బలమెంతో తేలిపోద్ది. వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలకు నగారా మ్రోగే అవకాశం ఉంది. దాన్ని బట్టి అదిష్టానం పార్టీ బలోపేతానికి ఎలా? పని చేయాలి! భవిష్యత్ ఏంటి? అన్నది ఆలోచించుకునే అవకాశం ఉంది. పునాదులు వేయాలా? ఉన్న పునాదులపై గోడలు కట్టాలా? అన్నది స్థానిక ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్ కో సీరియస్ గా ఆలోచన చేసే అవకాశం ఉంది.