తెలంగాణ లో పట్టపగలు నడి రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిలను దారుణంగా నరికి చంపటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన కొద్దీ సేపటికే ఈ దారుణం వెనుక అధికార తెరాస నేతల హస్తముందనే మాటలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన న్యాయవాది వామనరావు చావుబ్రతుకుల మధ్య కుంట శీను పేరును చెప్పాడు.
సదరు కుంట శీను టీఆర్‌ఎస్ మంథని మండల అధ్యక్షుడు. పైగా ఈ హత్యకు కత్తులు, వాహనం సమకూర్చిన బిట్టు శ్రీను సాక్షాత్తూ జిల్లా ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు కావడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో అనూహ్యంగా ఈ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతో పాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి సమకూర్చాడని పోలీసులు మీడియా సమావేశంలోనే వెల్లడించారు.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో పుట్ట మధుపై అనుమానపు మేఘాలు అలుముకుంటున్నాయి. వాహనం సమకూర్చింది కూడా అతనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతల్ని బిట్టు శ్రీనివాస్ చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం కూడా అధికార పార్టీకే చెందిన ఓ ప్రజాప్రతినిధిగా చెబుతున్నారు. దీంతో పుట్ట మధుపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. అవసరమైతే మధును పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేందుకైనా సిద్ధపడే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
ఈ మర్డర్ పై ప్రతిపక్షాలు, అడ్వకేట్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతుండడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోక తప్పలేదు. ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో పోలీస్‌శాఖ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో కఠినంగానే ఉన్నట్లు తెలుస్తుంది.