కర్నూలుకి అమరావతి సెగ.! జగన్ సర్కార్ పంతం నెగ్గేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోంది. మూడు రాజధానుల్లో ఏదీ ముందడుగు వేయలేకపోతోంది. అసలంటూ ఓ రాజధానిని అభివృద్ధి చేసుకుని, తద్వారా మరో రెండు కాదు, ఇరవై రాజధానులు ఏర్పాటు చేసుకున్నా.. ఎవరు మాత్రం కాదనగలరు.? అయితే, ఒకే ఒక్క రాజధాని అమరావతిని అయోమయంలో పడేసి, మిగతా రెండు రాజధానులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది జగన్ సర్కార్. ఈ క్రమంలో ప్రతిసారీ, ఆ రెండు రాజధానులకు అసలు రాజధాని అమరావతి నుంచి సెగ తగులుతోంది. తాజాగా, కర్నూలుకి అమరావతి సెగ గట్టిగా తగిలింది. అమరావతి జేఏసీ మహిళా నేత ఒకరు, కర్నూలు జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన మానవ హక్కుల కమిషన్ కార్యాలయంపై కోర్టును ఆశ్రయించారు. అమరావతి ఏర్పాటు చేయాల్సిన కార్యాలయాన్ని కర్నూలుకు ఎలా తరలిస్తారన్నది సదరు అమరావతి జేఏసీ నేత ప్రశ్న. ఈ వ్యవహారంపై కోర్టు తీర్పు ఎలా వస్తుంది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

విశాఖ విషయంలోనూ, కర్నూలు విషయంలోనూ ఇప్పటికే వైఎస్ జగన్ సర్కారు షాకుల మీద షాకులు తినేస్తోంది. అంతలా షాకులు తినాల్సిన అగత్యం ఎందుకు వస్తోంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. విధానపరమైన వ్యవహారాలో లోటుపాట్లతోనే ఈ సమస్య వస్తోందన్నది మెజార్టీ అభిప్రాయం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతోంది. ఈ రెండున్నరేళ్ళలో అమరావతి అభివృద్ధి కోసం జగన్ సర్కార్ ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేకపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాజెక్టు ప్రారంభమైతే, అది జగన్ అధికారంలోకి రాగానే ఆగిపోయింది. ఇప్పటికే ఆలస్యమైపోయింది. రాజధానిపై స్పష్టత అతి కొద్ది రోజుల్లో రాకుంటే, జగన్ సర్కారుకి అది అశనిపాతంలా మారుతుందన్నది నిర్వివాదాంశం. విశాఖకు ఏదన్నా కార్యాలయం తరలించినా, కర్నూలుకి ఏదన్నా కార్యాలయం తరలించినా, అమరావతి నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో.. ఇదంతా ప్రాంతాల మధ్య చిచ్చుకు కారణమవుతుండడం దురదృష్టకరం.