క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాలలోను భారీ అంచనాలుంటాయి. దర్శకుడిగా మారిన ఇన్నేళ్ళలో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి ఒక్కో సినిమా గురించి ఏళ్ళ తరబడి చెప్పుకునే సినిమా తీశాడు. గులాబి, నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, సముద్రం, అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ, పైసా, నక్షత్రం .. ఇలా చాలా సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ గా రూపొంది సక్సస్ అయినవే.
అయితే గతకొంత కాలంగా కృష్ణవంశీ సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి. 2017 లో వచ్చిన నక్షత్రం సినిమా మీద భారీ అంచనాలున్నప్పటికి ఈ సినిమా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ మళ్ళీ ఒక అద్భుతమైన కథ తో సినిమాని రూపొందిస్తున్నాడు. అదే రంగ మార్తాండ. ఈ సినిమా మీద కృష్ణవంశీ తో పాటు ప్రేక్షకులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్ తో 60 శాతానికి పైగా చిత్రీకరణ కంప్లీటయినట్టు సమాచారం. మిగతా టాకీ పార్ట్ కోసం త్వరలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పట్లో థియోటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు లేకపోవడం తో ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినట్టు దాంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నట్టు సమాచారం. అయితే ఇంకా కొంత టాకీపార్ట్ కంప్లీటవ్వాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు పరిస్థితులు చక్కబడతాయనే భావిస్తున్నారట. అయితే కృష్ణవంశీ లాంటి దర్శకుడు రూపొందించే సినిమాలని దాదాపు ప్రేక్షకులందరూ థియోటర్స్ లోనే చూడటానికి ఆసక్తి చూపిస్తారు. మరి ఓటీటీ అంటే ఇప్పుడు ఫ్లాప్ అన్న బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. మరి మేకర్స్ ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి.