కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి.! కాంగ్రెస్ నుంచి ఎవరు ఔట్.?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద వుందన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులే అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో వుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌లో చాలామందికి నచ్చడంలేదు. నిజానికి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితితోనో.. బీజేపీతోనో రేవంత్ రెడ్డి పోరాడటంలేదు.. సొంత పార్టీలోని నేతలతోనే పోరాడాల్సి వస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి భవితవ్యమేంటో తేలిపోనుంది. నిజానికి, ఆయన బీజేపీలోనో, తెలంగాణ రాష్ట్ర సమితిలోనో చేరిపోయి వుంటే.. రాజకీయంగా ఆయనకు మనుగడ వుండేదేమో. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీ అయ్యారన్న పేరు తప్ప, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వల్ల అస్సలేమాత్రం ఉపయోగం లేదు.

తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తనను కిందికి లాగెయ్యడానికి కొందరు చూస్తున్నారన్నది రేవంత్ రెడ్డి ఆవేదన. మరోపక్క, మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో తన అనుచరులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తన తమ్ముడిని గెలిపించాలని కోరుకుతున్నారు.

పైగా, ‘త్వరలో నేనే పీసీసీ అధ్యక్షుడినవుతా..’ అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులకు చెబుతుండడం గమనార్హం. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడవ్వాలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచన వెనుక లాజిక్కేమిటో.!

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వెంకటరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే కాంగ్రెస్ పార్టీలో వుండే అవకాశముంది.