తెలంగాణాలో చక్రం తిప్పుతాం అంటూ సవాళ్లు విసిరే కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధాన నాయకులే వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కాళ్ళు పట్టుకుని కిందికి లాగే పనులు చేస్తుండటంతో పార్టీ మారిపోతోంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు పార్టీ పట్ల మంచి విధేయతే ఉన్నా ప్రయోజనాలు చూసుకునే తత్త్వం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి లాంటి దూకుడు కలిగిన నాయకుడు సైతం పార్టీలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రేవంత్ ఏం చేసిన తప్పే అన్నట్టు కొందరు సీనియర్ నేతలు వ్యవహరిస్తున్నారు. మొదట్లో వారిని పట్టించుకున్నా రేవంత్ ఇప్పుడు పూర్తిగా పక్కనపెట్టేసి తన పనేదో తాను చూసుకుంటున్నారు. ఇలా కేసీఆరా మీద ఏ స్థాయిలో అయినా పోరాడటానికి సిద్ధంగా ఉండే రేవంత్ ఒంటరిగానే ముందుకుపోవాల్సి వస్తోంది.
ఇప్పడు ఆయన తరహాలోనే ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కాలని చూస్తున్నారట కొందరు నాయకులు. నల్గొండ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పెట్టని కోట లాంటిది. వరుసగా నాలుగుసార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయినా కుంగిపోకుండా భువనగిరి నుండి పోటీచేసి ఎంపీగా గెలిచారు. సొంత నియోజవర్గంలో కోమటిరెడ్డి ఓడిపోవడానికి ఆ పార్టీలో అప్పుడే చేరిన దుబ్బాక నర్సింహారెడ్డి కారణమని అంటుంటారు. పైగా ప్రస్తుతం నల్గొండ నియోజకవర్గంలో ఇంఛార్జిగా నర్సింహారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారట.
అన్ని కార్యక్రమాలలో ఆయనకే అధిక ప్రాధాన్యమిస్తూ ఎలివేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారట. వచ్చే అసెంబ్లీయే ఎన్నికల్లో నల్గొండ టికెట్ ఆయనకే ఇప్పించాలని, తద్వారా కోమటిరెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇది తెలుసుకున్న కోమటిరెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారని, టీపీసీసీ చీఫ్ రేసులో ఉండటం వలన వివాదాలకు దూరంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేస్తున్నారట. సమయం వచ్చినప్పుడు ఎదురుతిరిగి సత్తా చూపుతారట. మొత్తానికి ఈ వర్గపోరుతో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారే ప్రమాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.